ఎయిడెడ్ కాలేజీల అడ్మిషన్లపై జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్-ఎయిడ్ నిలిపివేతపైనా సీరియస్
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్ధల్నివరుసగా టార్గెట్ చేస్తున్న వైసీపీ సర్కార్ కు ఇవాళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వంలో ఎయిడెడ్ స్కూళ్లను, కాలేజీల్ని కలిపేయాలని, లేకుంటే ఎయిడ్ రద్దు చేస్తూమంటూ సర్కార్ చేస్తున్న బెదిరింపుల వ్యవహారం ఇవాళ హైకోర్టు దృష్టికి వచ్చింది. దీంతో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో ముఖ్యంగా ఎయిడెడ్ కళాశాలల విషయంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లు చేపట్టకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వ్యవహారం హైకోర్టు దృష్టికి వచ్చింది. దీంతో అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎయిడెడ్ కళాశాలలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.

ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ ప్రస్తావించారు. అయితే తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయవాది శ్రీనివాస్ వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన లిఖితపూర్వక ఆదేశాలను చదివి వినిపించారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోతే లక్షలాది విద్యార్థులు నష్టపోతారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం... అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది.
మరోవైపు ఏపీ సర్కార్ ఎయిడెడ్ కాలేజీలకు ఎయిడ్ నిలిపేస్తూ జారీ చేసిన మరో ఆదేశాలపైనా హైకోర్టు స్పందించింది. ప్రభుత్వానికి సహకరించకపోతే కాలేజీలు స్వాధీనం చేసుకునేలా జారీ చేసిన నోటిఫికేషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. త్వరలో ఈ నిర్ణయంపై హైకోర్టు విచారణ జరపనుంది. వాస్తవానికి ఏళ్ల తరబడి ప్రభుత్వ ఎయిడ్ అందీ అందక ఇబ్బందులు పడుతున్న కాలేజీలపై వైసీపీ సర్కార్ తాజాగా బెదిరింపులకు దిగింది. ఎయిడెడ్ కాలేజీల భూముల్ని స్వాధీనం చేసుకోవడం, టీచర్లను ప్రభుత్వ సర్వీసుల్లోకి కలిపేయడం వంటి నిర్ణయాలు తీసుకుంది. దీంతో వీటిపై యాజమాన్యాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరంతా హైకోర్టును ఆశ్రయించడంతో అడ్మిషన్ల వరకూ ఊరట దక్కింది.












Click it and Unblock the Notifications