జస్టిస్ కనగరాజ్ కు మరో షాక్-జగన్ కరుణించినా-పీసీఏ ఛైర్మన్ జీవో 6 వారాలు సస్పెండ్ చేసిన హైకోర్టు
ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా తొలగించే క్రమంలో తెరపైకి వచ్చిన జస్టిస్ కనగరాజ్ కు వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. అప్పట్లో కరోనా సమయంలో ఆంక్షలున్నా అంబులెన్స్ లో చెన్నై నుంచి వచ్చి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన కనగరాజ్ నియామకాన్ని తప్పుబట్టిన హైకోర్టు ఆరు వారాల పాటు జీవోను సస్పెండ్ చేసింది. దీంతో తాత్కాలికంగా ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. హైకోర్టు విచారణ కూడా ఆరువారాల పాటు వాయిదా పడింది.

జస్టిస్ కనగరాజ్
ఏపీలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో జగన్ సర్కార్ హోరాహోరీ పోరు సాగిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన పేరు జస్టిస్ కనగరాజ్. తమిళనాడుకు చెందిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కనగరాజ్ ను జగన్ సర్కార్ అనూహ్యంగా తెరపైకి తెచ్చి అప్పట్లో నిమ్మగడ్డకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే హైకోర్టు దీన్ని అడ్డుకోవడంతో ఆయన కూడా వచ్చిన దారినే చెన్నైకు వెళ్లిపోయారు. ఇక కనగరాజ్ తిరిగి రావడం కష్టమేనని అంతా భావిస్తున్న తరుణంలో జగన్ సర్కార్ ఆయనకు మరో ఆఫర్ ఇచ్చింది. పోలీసు కంప్లైంట్స్ అధారిటీ ఛైర్మన్ గా ఆయన్ను నియమించింది. విచిత్రంగా ఇది కూడా మరో వివాదానికి దారి తీసింది.

కనగరాజ్ నియామకంపై వివాదం
ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ వి.కనకరాజ్ ను జగన్ సర్కార్ ఈ ఏడాది నియమించింది. ఆయన కింద జిల్లాల్లో పోలీసు అధారిటీలు కూడా ఏర్పాటు చేసింది. కనగరాజ్ వయస్సు 68 సంవత్సరాలు అని, ఇది పోలీసు కంప్లెంట్స్ అధారిటీ ఛైర్మన్ హోదా నియామకానికి అడ్డంకి అని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో మొదలైన వివాదం అనేక మలుపులు తిరిగింది. వైసీపీ సర్కార్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ జీవో కూడా జారీ చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.

కనగరాజ్ కు హైకోర్టు షాక్
వయోవృద్ధుడైన జస్టిస్ కనగరాజ్ ను పోలీసు కంప్లెంట్స్ అధారిటీ ఛైర్మన్ గా నియమిస్తూ వైసీపీ సర్కార్ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. పారా కిషోర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కనగరాజ్ వయస్సు రీత్యా ఈ పదవికి అర్హుడా కాదా అనే దానిపై విచారణ జరిపిన హైకోర్టు... చివరికి ఆరువారాల పాటు ప్రభుత్వ జీవోను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ పారా కిషోర్ తరఫున న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. కనగరాజ్ ఈ పదివకి అర్హుడు కాదని హైకోర్టు ప్రాధమికంగా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

కనగరాజ్ కు కలిసి రాని అదృష్టం
జస్టిస్ వి.కనగరాజ్ ను నిమ్మగడ్డ స్ధానంలో గతంలో ఎస్ఈగా వైసీపీ సర్కార్ నియమించినా హైకోర్టు ఉత్తర్వులతో ఆయన ఆ పదవిని వదులుకోక తప్పలేదు. ఇప్పుడు పోలీసు కంప్లైంట్స్ అధారిటీ ఛైర్మన్ హోదాలో నియమించినా వయస్సు కారణాలతో ఆయన నియామకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హైకోర్టు కూడా ఆయన నియామకానికి వైసీపీ సర్కార్ ఇచ్చిన జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీంతో జస్టిస్ కనగరాజ్ కు మరోసారి నిరాశ తప్పలేదు. గతంలో ఓసారి హైకోర్టు ఉత్తర్వులతో భంగపడిన ఆయనకు మరోసారి ఇబ్బందులు తప్పడం లేదు. అయితే హైకోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications