ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట : ఎంపీటీసీ- జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు హై కోర్టు గ్రీన్‌సిగ్నల్..!!
ఏపీలో కొద్ది నెలలుగా తేలని అంశంగా మారిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల అంశంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ లో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఈ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కరోనాకు ముందు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసారు. అయితే, కరోనా మొదలు కావటంతో ఎన్నికలను వాయిదా వేస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఆ నిర్ణయం పైన నిమ్మగడ్డ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఏప్రిల్ లో ఎన్నికలు జరిగినా..ఫలితాలు పెండింగ్
ఎన్నికల వాయిదా పైన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని కోర్టులు సమర్ధించాయి. ఇక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు వీలుగా షెడ్యూల్ విడుదల చేసారు. ఏప్రిల్ 8న ఎన్నికలు.. 10న ఫలితాలు వెల్లడయ్యేలా షెడ్యూల్ ఖరారు చేసారు. దీని పైన హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందనే అంశం ఇందులో కీలకంగా మారింది.

ఎన్నికలు రద్దు చేసిన సింగిల్ బెంచ్
ఇదే అంశం పైన తొలుత ఎన్నికల కౌంటింగ్ పైన స్టే ఇచ్చిన కోర్టు ఎన్నికల నిర్వహణకు మాత్రం అనుమతి ఇచ్చింది. ఆ తరువాత ఈ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు పైన ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. అయితే, ఆ సమయంలో జరిగిన వాదనల్లో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికలకు తాము కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదని, గతంలోనే షెడ్యూల్ ఇవ్వగా..కరోనా కారణంగా జరగలేదని చెబుతూ..తిరిగి వాటిని కొనసాగించామని వివరణ ఇచ్చింది.

డివిజన్ బెంచ్ లో ఎన్నికల కమిషన్ అప్పీల్
అయితే, సుప్రీం ఆదేశాలకు భిన్నంగా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసందనే పిటీషనర్ల వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. రెండు పక్షాల వాదనలను విన్న తరువాత డివిజన్ బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఈ రోజు తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ లో నోటిఫికేషన్ జారీ చేసే సమయానికే అనేక జెడ్పీటీసీలు..ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏప్రిల్ లో 515 జెడ్పీటీసీలు..7720 పైగా ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికీ ఫలితాలు వెల్లడి కాలేదు. ఏకగ్రీవాల పైన సస్పెన్స్ కొనసాగుతోంది.
Recommended Video

హైకోర్టు తాజా తీర్పుతో..
అప్పటి నుంచి పోటీ చేసిన అభ్యర్ధులు కోర్టు తీర్పు కోసం నిరీక్షిస్తున్నారు. ఇక, ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీ ప్రభుత్వంతో పాటుగా పోటీ చేసిన అభ్యర్ధులకు ఉపశమనం కలిగింది. దీంతో.. ఇక, ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీన కౌంటింగ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తీర్పు కాపీ అందిన తరువాత తమ సిబ్బందితో సమావేశం నిర్వహించి కౌంటింగ్ తేదీ పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications