అమరావతిపై ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ
అమరావతి: రాజధాని అమరావతి రీజియన్‌లో ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లపై ఇవ్వాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అమరావతి రీజియన్ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయగా.. దీన్ని వ్యతిరేకిస్తూ రెండు రోజుల కిందట హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ పిటీషన్లు దాఖలయ్యాయి.
వాటిపై ఇవ్వాళ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటీషనర్ల తరఫు న్యాయవాది తన వాదనలను వినిపించారు. రాష్ట్రంలో అందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తోందని, జగనన్న కాలనీల పేరుతో వాటి నిర్మాణాన్ని చేపట్టిందని వివరించారు. అమరావతి రీజియన్ పరిధిలోని గ్రామాల్లో కూడా జగనన్న కాలనీలను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని, ఇక్కడ పేదలకు ఇళ్లను నిర్మించడం వల్ల సమతౌల్యం దెబ్బ తింటుందని పేర్కొన్నారు.

విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నివసించే పేదలకు ఏపీ ప్రభుత్వం- అమరావతి రీజియన్ పరిధిలో ఇళ్ల స్థలాలను మంజూరు చేయడాన్ని ఇక్కడి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారని, వారి అభిప్రాయాలను తెలియజేయడానికే ఆర్5 జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పిటీషన్లు దాఖలు చేశారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది తేల్చి చెప్పారు. అమరావతి రీజియన్ పరిధిలోని నివసించే గ్రామస్తులు ఆర్ 5 జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తోన్నారని వివరించారు.
ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎదురైన వ్యతిరేకతను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. స్థానికేతరులకు తమ గ్రామాల్లో ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తోన్నారని వివరించారు. పిటీషనర్ల తరఫున న్యాయవాది చేసిన వాదనలను ప్రభుత్వ అటార్నీ జనరల్ తోసిపుచ్చారు. ఆన్ని నిబంధనల మేరకే ఆర్-5 జోన్‌కు ప్రభుత్వం రూపకల్పన చేసిందని న్యాయమూర్తికి వివరించారు. పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తామంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏ ఒక్క ప్రాంతంలో కూడా స్థానికుల నుంచి వ్యతిరేకత గానీ, నిరసనలు గానీ వ్యక్తం కాలేదని వివరించారు. వాదోపవాదాలను విన్న తరువాత న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధాన న్యాయమూర్తి సమక్షానికి తీసుకుని రావాలని అన్నారు. ఈ మేరకు రిజిస్ట్రీని ఆదేశించారు. అనంతరం దీనిపై విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications