ఏపీ హైకోర్టు షాకులు- మమ్మల్నే తప్పుదోవ పట్టిస్తారా ? ఒకే రోజు రెండు కేసుల్లో ఫైన్లతో హెచ్చరికలు !
ఏపీలో నిన్న ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారికి జరిమానాలు కూడా విధించింది. దీంతో హైకోర్టు నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఈ రెండు పిటిషన్ల విషయంలోనూ పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించడమో లేక న్యాయప్రక్రియను దుర్వినియోగంచేసేందుకు ప్రయత్నించడమో చేశారు. దీంతో హైకోర్టు ఇకపై ఇలాంటి పనులుచేయకుండా కక్షిదారులకు గట్టి హెచ్చరికలు పంపింది.

ఏపీ హైకోర్టు సంచలనాలు
దేశంలోని ఏ న్యాయస్ధానానికైనా పిటిషనర్లు తమ సమస్యలు, ప్రభుత్వాల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చెప్పుకుని న్యాయం కోరేందుకు ఆశ్రయిస్తుంటారు. తొలుత వీటి విచారణార్హత నిర్ణయించి కోర్టులు ఆ తర్వాత విచారణ చేపడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో విచారణార్హత కంటే కూడా అత్యవసరమని భావిస్తే వెంటనే పిటిషన్లు స్వీకరించి విచారణ జరుపుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో న్యాయప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం పొంచి ఉంటోంది. ఇలాంటి రెండుసందర్భాల్లో తాజాగా ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారికి జరిమానాలు కూడా విధించింది.

ఇప్పటం పిటిషనర్లకు ఝలక్
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది పిటిషనర్లు గత నెలలో అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల ఇళ్లను కూల్చకుండా అధికారులకు అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. దీంతో కూల్చివేతలు ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత అధికారులు పిటిషనర్లకు జారీ చేసిన ముందస్తు నోటీసుల్ని కోర్టులో సమర్పించారు. దీంతో హైకోర్టు ఇప్పటం పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు జారీ చేసినా ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించినందుకు వారికి తలో లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది.

రంగంపేట పిల్ కూ ఇదే జరిమానా..!
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ముగ్గురు పిటిషనర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఈ పిల్ కూడా తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని భావించింది. దీంతో ఈ పిల్ దాఖలు చేసిన ముగ్గురు పిటిషనర్లకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించింది. నాలుగు నెలల్లోగా న్యాయ సేవాధికార సంస్ధకు ఈ మొత్తం జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications