ఏపీ హైకోర్టులో తోట త్రిమూర్తులకు దక్కని ఊరట
Thota Trimurthulu: దళితుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగింది. ఈ కేసులో ఆయనకు ఊరట లభించలేదు. దీనిపై తదుపరి విచారణ మే 1వ తేదీకి వాయిదా పడింది.
దళితుల శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులు జైలుశిక్షను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. 1996 డిసెంబర్ 29వ తేదీన రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో అయిదుమంది దళితులపై దాడులకు పాల్పడటం, వారిలో ఇద్దరిని శిరోముండనం చేసిన ఘటనలో తోట త్రిమూర్తులును దోషిగా తేల్చింది విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం.

ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఈ కేసులో దోషులుగా నిర్ధారించింది విశాఖలోని ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం. వారికి 18 నెలల జైలుశిక్ష, రెండున్నర లక్షల రూపాయల జరిమానాను విధించింది. దీనిపై స్టే ఇవ్వాలంటూ తోట త్రిమూర్తుల ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్ దాఖలు చేశారు.
దీన్ని విచారణకు స్వీకరించింది హైకోర్టు. నేడు విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదోపవాదాలను ఆలకించింది. తోట త్రిమూర్తులు కోరిన విధంగా స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలంటూ తోట త్రిమూర్తులుపై ఫిర్యాదు చేసిన వారిని ఆదేశించింది న్యాయస్థానం. అనంతరం ఈ పిటీషన్లపై విచారణను మే 1వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications