AP DSC 2024: ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులా ? హైకోర్టు ఫైర్- కీలక నిర్ణయాలకు సిద్ధమై..!
ఏపీలో తాజాగా విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్ధులను అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ లో అనుమతి ఇవ్వడాన్ని తప్పుబట్టింది. ఓ దశలో డీఎస్సీ నోటిఫికేషన్ పైనే స్టే ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే హాల్ టికెట్లు మాత్రం విడుదల చేయొద్దని సూచించింది. ఇవాళ మరోసారి ఇదే అంశంపై హైకోర్టు కీలక విచారణ చేపట్టనుంది.

తాజాగా విడుదలైన డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీని కూడా అర్హతగా పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నా నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్ధుల్ని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. విద్యార్ధులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకోమని తేల్చిచెప్పేసింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్కరణల్లో భాగంగా మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకూ ప్రాథమిక విద్య పరిధిలోకి తెచ్చిందని, కాబట్టి వీరికి బోధన చేసేందుకు డీఈడీ, బీఈడీ అభ్యర్ధులు ఇద్దరూ అవసరమని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. టీచర్లుగా ఎంపికైన తర్వాత ఎన్సీటీఈ బ్రిడ్జ్ కోర్సులో వీరికి శిక్షణ ఇస్తామని తెలిపారు. అయితే ఓవైపు బోధన, మరోవైపు శిక్షణ ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
ప్రభుత్వ వాదనతో సంతృప్తి చెందని హైకోర్టు ఓ దశలో డీఎస్సీ నోటిఫికేషన్ పై స్టే ఇస్తామని, హాల్ టికెట్లు కూడా విడుదల చేయొద్దని సూచించింది. అయితే ప్రభుత్వం నుంచి అదనపు వివరాలు సమర్పించే వరకూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏజీ కోరడంతో ఇవాళ్టికి విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణలో ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా హైకోర్టు తదుపరి నిర్ణయం ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications