ఏపీ మెడికల్ అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటాకు బ్రేక్-హైకోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీలోని మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుపై హైకోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మెడికల్ సీట్ల అడ్మిషన్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలును తాత్కాలికంగా నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ సీట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు వ్యతిరేకంగా ఇతర అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు తీసుకునే విద్యార్ధుల్లో ఆందోళన మొదలైంది.
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. వీటిలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు గతంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఆయా కోర్సుల్లో సీట్లు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయడం వల్ల తాము నష్టపోతున్నామంటూ ఇతర కేటగిరీల అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. సీట్లు పెంచకుండానే EWS కోటా అమలు చేస్తున్నారని, దీని వల్ల ఓపెన్ కేటగిరి కింద ఉన్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం ఉన్న సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేయాలని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గతంలో దీనిపై ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలిపివేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఆరు వారాల తర్వాత హైకోర్టు దీనిపై తిరిగి పరిశీలన జరిపి తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. ఆలోపు ఈడబ్ల్యూఎస్ కోటా లేకుండా అడ్మిషన్లు చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications