రఘురామకు సొంతూరిలో సంక్రాంతి ఉందా లేదా ? తేల్చబోతున్న హైకోర్టు ..
వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆరునెలలకే ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టిన నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల కేసులో సీఐడీ అరెస్టు, బెయిల్ తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒకట్రెండు సార్లు నరసాపురానికి రావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆయనపై ప్రభుత్వం నమోదు చేసిన ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇప్పుడు మరోసారి నరసాపురం రావడానికి ప్రయత్నిస్తున్నారు.
నాలుగేళ్లుగా అరెస్టు భయంతో నరసాపురం రాకుండా ఢిల్లీ, హైదరాబాద్ కే పరిమితం అయిన రఘురామకృష్ణంరాజు.. ఎన్నికల సమయం కాబట్టి ఇబ్బందులు ఉండకపోవచ్చని మరోసారి సొంత నియోజకవర్గానికి రావాలని నిర్ణయించారు. రేపు ఉదయం 10 గంటలకు విమానంలో రాజమండ్రికి చేరుకుని అక్కడి నుంచి నేషనల్ హైవే మీదుగా... రాజమండ్రి, రావులపాలెం, సిద్దాంతం, వడలి, పెనుగొండ, మార్టేరు, పాలకొల్లు, వీరవాసరం మీదుగా భీమవరంలోని పెద అమిరంలో ఉన్న ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆయనకు అరెస్టు భయం మాత్రం వీడటం లేదు.

దీంతో రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. సంక్రాంతికి నియోజకవర్గంలోని ప్రజల్ని కలుసుకునేందుకు వస్తున్న తనను పోలీసులు ఏదో ఒక తప్పుడు కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని, కాబట్టి వారిని చట్టపరంగా వ్యవహరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ పై 11 తప్పుడు కేసులు పెట్టారని, గతంలో ఇందులో ఓ కేసులో అరెస్టు చేసి తీవ్రంగా కొట్టారని కూడా ఆయన లాయర్లు కోర్టుకు తెలిపారు.
దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది... పిటిషనర్ రఘురామది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. ఆయనపై తాజాగా ఎలాంటి కేసు నమోదు కానప్పుడు అరెస్టు చేసే సమస్య తలెత్తదన్నారు. అలాగే తనను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పిటిషనర్ కోరలేరని హైకోర్టుకు తెలిపారు. కాబట్టి ఈ పిటిషన్ కు విచారణార్హత లేదన్నారు. దీనిపై ఇవాళ కూడా వాదనలు కొనసాగాక హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇవాళ హైకోర్టులో ఊరట లభిస్తే రేపు రఘురామకు నరసాపురంలో సంక్రాంతి ఉంటుంది.












Click it and Unblock the Notifications