అమరావతి పనులు ఎంతవరకొచ్చాయ్ ? కోర్టు ధిక్కారమెంత ? కాసేపట్లో హైకోర్టు విచారణ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి స్ధానంలో మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో రాజధానిలో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో స్పందించిన న్యాయస్ధానం.. అమరావతిలో యథాతథంగా పనులు చేయాల్సిందేనని తీర్పు ఇచ్చింది. దీన్ని అమలుచేయడంలో వైసీపీ సర్కార్ విఫలం కావడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేయబోతోంది.
అమరావతిలో పనుల్ని పూర్తి చేసేందుకు హైకోర్టు విధించిన గడువు ఆరునెలలే కాగా.. ప్రభుత్వం 60 నెలలు ఇవ్వాలని కోరుతోంది. అయితే పనుల్ని మాత్రం ప్రారంభించింది. వీటిలో కొన్ని పూర్తి కూడా అయినట్లు తెలుస్తోంది. మిగతా పనులు పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పలువురు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపేందుకు హైకోర్టు సిద్ధమైంది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌ల నేతృత్వంలోని బెంచ్ రాజధాని పిటిషన్లపై విచారణ జరపనుంది. రాజధాని తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదంటూ పలువురు న్యాయవాదులు కోర్టు ధిక్కార పిటిషన్లను దాఖలు చేశారు. గతంలో స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిహైకోర్టు ఆదేశించింది. రాజధానిలో భూముల అమ్మకంపై కూడా రైతుల తరపున హైకోర్టులో న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. వీటిపై హైకోర్టు విచారణ జరిపి ఇవ్వబోయే ఆదేశాలు కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications