Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లికి ఇవాళ హైకోర్టు బెయిల్ ఇస్తుందా ?
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ పొందిన పిన్నెల్లిని హత్యాయత్నం సహా మరో మూడు కేసులు వెంటాడుతున్నాయి. దీంతో వీటిలోనూ ముందస్తు బెయిల్ కావాలని దాఖలు చేసిన పిటిషన్ పై ఇప్పటికే విచారణ ముగిసింది. ఇవాళ హైకోర్టు తీర్పు ప్రకటించబోతోంది.

పోలింగ్ రోజు మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పిన్నెల్లి పాత్రపై పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు, మరో మహిళపై దాడులు, సీఐపై హత్యాయత్నం వంటి ఘటనల్లో పిన్నెల్లి నేరుగా పాల్గొనడంతో ఆయనపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం ఆయన బెయిల్ ను వ్యతిరేకించారు.
నిన్న జరిగిన వాదనల్లో పిన్నెల్లిపై హత్యాయత్నంతో పాటు తీవ్ర కేసులున్నాయని వాదించారు. అలాగే ఈ కేసులో బాధితులుగా ఉన్న వారు కూడా పిన్నెల్లికి ఇప్పుడు బెయిల్ ఇస్తే కౌంటింగ్ రోజు హింస పునరావృతం అయ్యే అవకాశం ఉందని, తమను భయబ్రాంతులు చేసే అవకాశముందని వాదించారు. దీంతో పిన్నెల్లికి ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇవాళ మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్ పై హైకోర్టు తన తీర్పు ప్రకటించనుంది. దీని ఆధారంగా పిన్నెల్లి మాచర్లకు తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications