మళ్లీ మూడు రాజధానుల విచారణ-ఎల్లుండి నుంచి హైకోర్టులో రోజువారీగా-జగన్ టార్గెట్ అదే
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారాన్ని వైసీపీ సర్కార్ ఏ క్షణాన ప్రారంభించిందో తెలియదు కానీ అన్నీ ఆటంకాలే. 2019లో అసెంబ్లీలో జగన్ మూడు రాజధానుల ప్రకటన, ఆ తర్వాత దానికి మద్దతుగా రిపోర్టులు తెప్పించడం, అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం తీసుకోవడం జరిగినా మండలి తిరస్కారం మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి ట్విస్ట్ గా మారింది. దీంతో హైకోర్టులో రాజధానుల్ని వ్యతిరేకిస్తూ దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ పిటిషన్లపై విచారణ ప్రారంభించేందుకు హైకోర్టు సిద్ధమైంది.

మూడు రాజధానుల ప్రక్రియ
ఏపీలో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించి ఈ డిసెంబర్ కు రెండేళ్లు పూర్తయి మూడో ఏడాదిలోకి అడుగు పెడుతోంది. అయినా ఇప్పటివరకూ తమ చేతుల్లో ఉన్న కార్యనిర్వాహక ప్రక్రియ పూర్తిగా, శాసన ప్రక్రియ పాక్షికంగా పూర్తిచేసుకుని న్యాయప్రక్రియ ముంగిట నిలిచింది. ప్రస్తుతం హైకోర్టులో ఉన్న రాజధానుల పిటిషన్లపై విచారణ పూర్తయి తీర్పు వెలువడాల్సి ఉంది.
అలాగే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు కావడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. అది కూడా పూర్తి చేసుకుని మూడు రాజధానులు ఎప్పుడు అమల్లోకి వస్తాయోనని విశాఖ, కర్నూలు ప్రజలు ఎదురుచూస్తున్నారు. అమరావతిలో ఎప్పటిలాగే నిరసనలు తప్పడం లేదు.

అమరావతి పాదయాత్ర
అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిరసనగా రైతులు ప్రారంభించిన న్యాయస్ధానం టూ దేవస్ధానం మహా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ యాత్రను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రోజురోజుకీ ఈ యాత్రకు పెరుగుతున్న మద్దతే ఇందుకు కారణం. వాస్తవానికి ముందు ఈ యాత్రను లైట్ తీసుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత లభిస్తున్న ప్రజాదరణతో ఆత్మరక్షణలో పడుతోంది.
తొలుత ఎలాంటి ఆంక్షలు లేకుండా యాత్రకు సహకరించిన పోలీసులు.. ఇప్పుడు లాఠీఛార్జ్ ల వరకూ వెళ్తున్నారు. ఈ యాత్రకు సంఘీభావం పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో అమరావతి పాదయాత్ర వ్యవహారం ప్రభుత్వంలో చర్చకు తావిస్తోంది.

హైకోర్టులో మళ్లీ రాజధానుల విచారణ
హైకోర్టులో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా దాదాపు వందకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ రెండుసార్లు ప్రారంభమై నిలిచిపోయింది. ఈ రెండుసార్లూ ఛీఫ్ జస్టిస్ లు జేకే మహేశ్వరి, అరూప్ గోస్వామి బదిలీలే దీనికి కారణమయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో ఈ విచారణ ప్రారంభం కాబోతోంది. ఈ నెల 15న తిరిగి మూడు రాజధానుల విచారణను ప్రారంభించబోతున్నట్లు హైకోర్టు ధర్మాసనం సంబంధిత పిటిషనర్లు, న్యాయవాదులు, ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. దీంతో ఇప్పుడు వీరంతా హైకోర్టు విచారణకు సిద్ధమవుతున్నారు.

హైబ్రిడ్ విధానంలో రోజువారీగా
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నెమ్మదించినా హైకోర్టులో మాత్రం పూర్తిస్ధాయిలో భౌతిక విచారణలు జరగడం లేదు. దీంతో రాజధానుల పిటిషన్లపైనా హైబ్రిడ్ విధానంలో (భౌతిక, ఆన్ లైన్ ) విచారణ చేపట్టేందుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైబ్రిడ్ విధానంలో జరుగుతున్నా రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది.
ఈ మేరకు వాదనలు సిద్ధం చేసుకోవడంతో పాటు రోజువారీ విచారణకు హజరయ్యేలా షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని న్యాయవాదులకు హైకోర్టు ధర్మాసనం నుంచి ఆదేశాలు అందాయి. రోజువారీ విచారణకు పిటిషనర్లతో పాటు ప్రతివాదులు, న్యాయవాదులు కూడా అందుబాటులో ఉండాల్సి వస్తుంది.

మళ్లీ మొదటి నుంచి విచారణ
మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై విచారణను గతంలో హైకోర్టు ప్రారంభించి నిలిపేసింది. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి దీనిపై విచారణ ప్రారంభిచబోతోంది. అయితే మరోసారి మొదటి నుంచి విచారణ ప్రారంభం కానుంది. దీంతో పిటిషనర్లతో పాటు ప్రతివాదులు సైతం తమ వాదనల్ని ముందు నుంచి సిద్ధం చేసుకోవాల్సిన పరిస్దితి. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాదనల్ని మరోసారి వినిపించాల్సి ఉంటుంది.
దీంతో ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు తమ వాదనలు సిద్దం చేసుకుంటున్నారు అలాగే రోజువారీ విచారణ కావడంతో అన్నీ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత కారణాలతో వాయిదాలు ఇవ్వబోమని కూడా న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టచం చేసింది.

కేంద్రం నిర్ణయమే కీలకం?
గతంలో కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో తమ వాదన అఫిడవిట్ల రూపంలో వినిపించింది. ఇందులో రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెప్పింది. దీంతో వైసీపీ సర్కార్ కు భారీ ఊరట దక్కింది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లులకు కేంద్రం నుంచి కూడా మద్దతు లభిస్తే చాలనే భావనలో వైసీపీ సర్కార్ కూడా ఉంది.
కానీ మారిన పరిస్ధితుల్లో కేంద్రం గతంలో చెప్పిన విధంగా మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమనే వాదన వినిపిస్తుందా లేక కొత్తగా ఏమైనా చెబుతుందా అన్న ఆసక్తి కూడా నెలకొంది. అమరావతి రాజధానిపై తాజాగా బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో దీనిపై ఉత్కంఠ నెలకొంటోంది.
Recommended Video

జగన్ టార్గెట్ అదే
మూడు రాజధానులపై హైకోర్టు విచారణ నవంబర్ 15న ప్రారంభమై రోజువారీగా సాగనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని వైసీపీ ప్రభుత్వం ఆశాభావంగా ఉంది. ఎందుకంటే ఉద్యోగుల్ని విశాఖకు తరలించేందుకు ఏప్రిల్ గడువు ఉంటుంది. ఏప్రిల్ లో అయితే పిల్లలకు పరీక్షల సీజన్ కూడా ముగుస్తుంది.
ఏప్రిల్లో తేలిపోతే మేలో తరలింపు చేపట్టేందుకు కూడా వీలు కలుగుతుంది. దీంతో ఏప్రిల్ కల్లా ఈ విచారణ పూర్తయితే మూడు రాజధానుల తరలింపు ప్రక్రియ చేపట్టేందుకు అవకాశం దొరుకుతుంది లేకపోతే తరలింపు కోసం మరో ఏడాది వేచి చూడాల్సి వస్తుంది. దీంతో జగన్ కూడా సాధ్యమైనంత త్వరగా ఈ విచారణ పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు అధికారులతో ఏర్పాట్లు చేయిస్తున్నారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications