డీఎస్సీ టీచర్లకు హోంమంత్రి ఘన సన్మానం..! భోజనాలు పెట్టి మరీ..!
ఏపీలో కూటమి సర్కార్ మెగా డీఎస్సీని నిర్వహించడంతో పాటు తాజాగా పోస్టింగ్స్ కూడా ఇస్తోంది. రాష్ట్ర స్ధాయిలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు జిల్లాల్లోనూ ఆ స్ధాయిలో నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చింది. దీంతో డీఎస్సీలో ఎంపికైన టీచర్లు ఆశ్చర్యపోయేలా ప్రభుత్వం వారికి సన్మానాలు చేసి, భోజనాలు పెట్టించి మరీ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చి పంపుతోంది. ఇదే క్రమంలో అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత డీఎస్సీలో ఎంపికైన టీచర్లను సన్మానించారు.
పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో మెగా డిఎస్సీలో ఎంపికైనా ఉపాధ్యాయులకు హోం మంత్రి అనిత ఆద్వర్యంలో వేంపాడు టోల్ ఫ్లాజా సమీపంలో భారతి కన్వెన్షన్ హాల్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. 147 మంది ఉపాధ్యాయుల్ని హోంమంత్రి సన్మానించారు. వారికి కొత్త వస్త్రాలు,శాలువా, ఒక్కక్కరికి ఒక మొక్క ఇచ్చి ఘనంగా సత్కరించారు. పాయకరావుపేట మండలం పీఎల్ పురం గ్రామానికి చెందిన బడుగు ధనలక్ష్మికి హోంమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేశారు.

రాబోయే తరాలను తయారుచేసే ఉపాధ్యాయులకు హోంమంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తారని తెలిపారు. మెగా డీఎస్సీ విషయంలో 140 కోర్టు కేసులు వేశారని వైసీపీ నేతల్ని విమర్శించారు.
లోకేష్ డీఎస్సీ కోసం ఒక తపస్సే చేశారని, మెగా డీఎస్సీ కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో తొమ్మిడి డీఎస్సీలు నిర్వహించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాను టీచర్ నని, 2002 టీచర్ గా ఉన్నా తనను ఇప్పుడు తన మంత్రివర్గంలో మంత్రిని చేశారని గుర్తుచేసుకున్నారు.

తాను టీచర్ గా ప్రస్థానం ప్రారంభించాను కాబట్టే ఈ స్థాయిలో ఉన్నానని హోంమంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్ ఉపాధ్యాయుల బాధ్యత అన్నారు. విద్యార్థికి టీచర్ ఒక స్ఫూర్తి అన్నారు. ఏ పాఠశాలలో జాయిన్ అవుతారో, ఆ పాఠశాలలో తాను ఇచ్చే మొక్కను నాటాలని ఉపాధ్యాయుల్ని ఆమె కోరారు. మంత్రి లోకేష్ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చారని, పాఠశాల అంటే ఒక దేవాలయం అని భావించి ఎలాంటి సమావేశాలు నిర్వహించకూడదని లోకేష్ నిర్ణయం తీసుకున్నారని అనిత గుర్తుచేశారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి హోం మంత్రి అనిత భోజనం చేశారు.












Click it and Unblock the Notifications