ఏపీ ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం, కేంద్రంవైపు చూపు: యనమల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం తగ్గిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేంద్రం నిధుల కోసం ఎదురు చూస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం నాడు చెప్పారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.
రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ 2018 డిసెంబర్ నాటికి చేస్తామని చెప్పారు. రైతుల రుణాలు, అందుకు వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. వ్యవసాయం లాభసాడిగా చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని యనమల అన్నారు.
రైతు ఆత్మహత్యల పైన వచ్చే నెలలో సమావేశమై సుదీర్ఘంగా చర్చిస్తామని చెప్పారు. ఏపీలో ఆదాయం తగ్గిందన్నారు. కేంద్రం నిధుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో అన్ని విభాగాలు ఖర్చు తగ్గించుకోవాలన్నారు. రుణమాఫీ, పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో రూ.9వేల కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. రుణమాఫీ అమలుపై ఏర్పాటైన సబ్ కమిటీ భేటీ ఉదయం విజయవాడలో భేటీ అయింది.

కమిటీ సమావేశానికి హాజరైన యనమల భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నులు సహా అబ్కారీ ఆదాయం, రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని ఆయన చెప్పారు.
రైతులకు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద 55.28 లక్షల మందికి రుణమాఫీ చేశామని మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. జనవరి 10లోగా రెండో విడత రుణమాఫీ చేస్తామన్నారు. ఫిర్యాదులు నవంబర్ 30వ తేదీలోగా స్వీకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చించి రెయిన్ గన్స్ వినియోగంపై నిర్ణయిస్తామన్నారు.
300 ఎకరాలు సేకరించాలి: నారాయణ
రాజధాని ప్రాంతంలో ఇంకా 300 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని మంత్రి నారాయణ అన్నారు. రైతులు భూసమీకరణకు రావాలని సూచించామని, భూసమీకరణకు వారు ఒప్పుకోకపోతే 15 రోజుల్లో సీఆర్డీఏ చట్టం కింద భూసేకరణ చేపడతామన్నారు. 19 గ్రామాల్లో భూమి సేకరించాల్సి ఉందన్నారు.
రైతులే స్వచ్ఛందంగా భూసమీకరణకు సహకరించాలని కోరారు. 20వేల మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి రావాల్సి ఉందన్నారు. చైనా తరహాలో అత్యాధునిక రీతిలో అమరావతిలో భవనాలను నిర్మించేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications