ఉద్యమించకపోతే మూల్యం చెల్లించక తప్పదు
వైసీపీ సర్కారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు రావడంలేదని, ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడంలేదంటూ ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చేవరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. డిమాండ్ల సాధనకై సోమవారం నుంచి మూడో దశ ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.
ఉద్యమ కార్యాచరణలో భాగంగా నాలుగు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. శ్రీకాకుళంలో మంగళవారం జరుగుతుందన్నారు. రెండు దశల్లో ఉద్యోగులు ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, సమయానికి వేతనాలు కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రభుత్వం కష్టపెడుతోందని, ఒక్కో ఉద్యోగికి లక్షల రూపాయలు రావాల్సి ఉందని, దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

చర్చల పేరుతో ఉద్యోగులను పిలిచి అవమానిస్తున్నారని, చివరకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితికి వచ్చిందన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఉద్యోగులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతి ఉద్యోగి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. జీతాలు సరైన సమయానికి పడక ఇబ్బందులు పడుతున్నామని, 28వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యమించకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగుల వేతనాలకే సరిపోతోందన్న ప్రభుత్వ వాదనను బొప్పరాజు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం లక్ష కోట్ల రూపాయలైతే ఉద్యోగులకే రూ. 90 వేల కోట్లు ఖర్చవుతోందంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి చెప్పడం దారుణమని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. వాలంటీర్ల వేతనాలతో కలిపి ఉద్యోగులకు చెల్లించే మొత్తం రూ.60 వేల కోట్లకు మించి ఉండదన్నారు.












Click it and Unblock the Notifications