TTD: శ్రీవారి సేవకులకు కొత్త బాధ్యతలు, రేటింగ్స్ - ఇక వీరికీ ఛాన్స్..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురుపౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు తరలి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం 18 గంటలు పడుతోంది. ఇదే సమయంలో ఈ రోజు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు చేసిన టీటీడీ.. శ్రీవారి భక్తుల సేవల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద భక్తులకు జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ ఈ రోజు (బుధవారం) రద్దు చేసారు. శుక్రవారం జరిగే దర్శనానికి సంబంధించి గురువారం మధ్యాహ్నం నుంచి భక్తులకు యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. శ్రీవారి సేవకుల విషయం లో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సేవను మరింత విస్తరించేందుకు గ్రూప్ సూపర్ వైజర్లు అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఈవో రవిచంద్ర కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 వేల ఆలయాలు ఉన్నాయని, ఆయా దేవాలయాల్లో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు సేవలందించేందుకు ఉన్న అవకాశాలను శ్రీవారి సేవకుల ద్వారా టీటీడీ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.

శ్రీవారి సేవకుల సేవల పరిధి విస్తరణ
గ్రూపు సూపర్ వైజర్లు శిక్షణా కార్యక్రమం ద్వారా నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుండి శ్రీవారి సేవకు విచ్చేసే ముందు సేవకులకు శిక్షణ ఇవ్వడం వల్ల వారు తిరుమలకు వచ్చి నాణ్యమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. శ్రీవారి సేవకులు స్వామివారికి సేవ చేయడానికి తిరుమలకు రావడంతో పాటు తమ ప్రాంతాలు, గ్రామాల్లోని స్థానిక ఆలయాల్లో సేవలందించేలా వారిని ప్రోత్సాహించాలని చెప్పారు. కాగా, శ్రీవారి సేవకులకు వారి పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ ఇచ్చి, ఆ రేటింగ్ ఆధారంగా విధులు కేటాయించే విధానంపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గ్రూప్ సూపర్ వైజర్ల శిక్షణా కార్యక్రమం, శ్రీవారి సేవను గ్రామస్థాయిలో విస్తరించడం, భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరచడం వంటి అంశాలపై గ్రూప్ సూపర్వైజర్ల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని భక్తులకు నాణ్యమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications