చక్రం తిప్పిన గౌతమ్ గంభీర్- ప్రియ శిష్యుడికి ఐపీఎల్ లో భారీ ఆఫర్ ఇప్పించాడు
భారత క్రికెట్ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేసిన నెదర్లాండ్స్ మాజీ ఆల్ రౌండర్ ర్యాన్ టెన్ డెస్చాటేకు మరో పదవి వరించింది. టీమిండియా నుంచి తప్పుకొన్న కొన్ని గంటల్లోనే అతనికి గోల్డెన్ ఆఫర్ లభించింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ నుంచి పిలుపు అందింది. నైట్ రైడర్స్ గ్రూప్ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్ లీడర్‌షిప్ పాత్రలో ఆయన నియమితులు అయ్యారు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా వెల్లడించింది కూడా.
దీనిపై నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. టెన్ డోస్చాటెను తమ గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా నియమించినట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న నైట్ రైడర్స్ నెట్‌వర్క్ క్రికెట్ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత ఆయనకు అప్పగించింది. ఆటగాళ్ల ఎంపిక, దీర్ఘకాల వ్యూహాలకు రూపకల్పనతో పాటు విభిన్న లీగ్‌లలోని జట్లకు వ్యూహాత్మకంగా ఆయనే శిక్షణ ఇస్తారు.

టీమిండియాలో పనిచేసిన సమయంలో టెన్ డెస్చాటె.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కుడిభుజంగా వ్యవహరించారు. బ్యాటింగ్ ప్రాక్టీస్, ఫీల్డింగ్ సెషన్లు, వ్యూహాత్మక ప్రణాళికల్లో కీలక భాగస్వామి అయ్యారు. ఫీల్డింగ్ కోచ్ హోదా లభించకపోవడంతో కొంత అసంతృప్తికి లోనయ్యారనే వాదనలు ఉన్నాయి. ఆయనను తీసుకునే సమయంలో కూడా బీసీసీఐ మాటిచ్చింది కూడా. అది నెరవేరలేదు. అదే సమయంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ లల్లో టీమిండియా వరుస సిరీస్ ఓటములు చవి చూసింది.
దీంతో అసిస్టెంట్ కోచ్ హోదా నుంచి తప్పుకొన్నారాయన. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రారంభ రోజుల్లోనే అంటే.. 2024 జూలైలో టెన్ డెస్చాటె అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యారు. ఆయన హయాంలో భారత్ ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌ను నిలబెట్టుకుంది. బీసీసీఐ ఆయన కాంట్రాక్ట్ గడువును 2027 వరకు పొడిగించాలని ప్రతిపాదించినప్పటికీ.. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం.
అదే సమయంలో నైట్ రైడర్స్ నుంచి పిలుపు అందుకున్నారాయన. ఈ ఫ్రాంఛైజీతో ఆయనకు దశాబ్దానికి పైగా అనుబంధం ఉంది. 2011 లో ఆల్ రౌండర్ గా కేకేఆర్‌లో చేరారు. 2012, 2014 లలో ఐపీఎల్ టైటిళ్లను గెలవడంలో కీలక పాత్ర పోషించారు. రిటైర్‌మెంట్ తర్వాత.. 2022లో అసిస్టెంట్ కోచింగ్ స్టాఫ్ గా చేరారు. గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో 2024 ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్టుకు కోచింగ్ స్టాఫ్ లో డెస్చాటె ఒకరు.
Welcome home, Tendo 💜🥺 pic.twitter.com/Ut7hWqMAsA
— KolkataKnightRiders (@KKRiders) July 29, 2026
ప్రస్తుత కేకేఆర్ గ్లోబల్ ఆపరేషన్స్ హెడ్ గా అపాయింట్ కావడంతో ఆయన బాధ్యతలు పెరిగినట్టయింది. అంతర్జాతీయ లీగ్స్ ఆడుతున్న నైట్ రైడర్స్ జట్లు.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఐఎల్ టీ20 లో అబుదాబి నైట్ రైడర్స్, మేజర్ లీగ్ క్రికెట్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్లకు కూడా ఆయన అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తారు. దీనివల్ల ప్రతీ లీగ్‌లోనూ ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించడానికి వీలవుతుంది.
ఈ ప్రతిష్టాత్మక నియామకంపై నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ హర్షం వ్యక్తం చేశారు. టెన్ డెస్చాటె రాక తమ ఫ్రాంచైజీ అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని, ఫ్రాంఛైజీపై పూర్తి అవగాహన ఉన్న ఆయన.. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకున్న సుదీర్ఘ అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తారని అన్నారు.















Click it and Unblock the Notifications