ఉద్యమ కార్యాచరణ పై ఏపీ ఉద్యోగుల జేఏసీ కీలక ప్రకటన..!!
అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఉద్యోగుల జేఏసీ మరోసారి ఉద్యమానికి సిద్దం అవుతోంది. మూడో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నుంచి అమలు చేసే కార్యక్రమాల షెడ్యూల్ ను వెల్లడించింది. ఉద్యోగుల ఉద్యమం పై ప్రభుత్వం చులకనగా వ్యవహరిస్తోందని జేఏసీ నేతలు విమర్శించారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తినేలా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక మౌనంగా ఉండబోమని ప్రకటించారు.
మరోసారి పోరాటానికి:ప్రభుత్వం పైన మరోసారి పోరాటానికి ఉద్యోగ సంఘాల జేఏసీ సిద్దమైంది. సమర శంఖం పూరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు సమావేశమై మూడో విడత ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసారు. గత 53 రోజులుగా నిరసన తెలుపుతున్న ఉద్యోగులు ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటంతో మూడో విడత ఉద్యమానికి సిద్దం అవుతున్నట్లు ప్రకటించారు. ప్రతీ ఉద్యోగి భుజం భుజం కలిపి ప్రభుత్వ వ్యవస్థను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మౌనం వహిస్తే భవిష్యత్ లో ఇబ్బంది కర పరిస్థితులు తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఇందుకోసం మే 8 నుంచి జూన్ 9 వరకు జరిగే ఉద్యమంలో అందరూ కలిసి రావాలని జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు పిలుపునిచ్చారు.

కార్యాచరణ ప్రకటన:మే 8 నుంచి జూన్ 9 వరకు జరిగే మూడో దశ ఉద్యమంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొంటారని బొప్పరాజు చెప్పారు. మే 8న ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు, సస్పెన్షన్లను ఉప సంహరించాలని..సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాల కలెక్టర్లకు స్పందనలో వినతులు ఇవ్వాలని నిర్ణయించారు. మే 9న శ్రీకాకుళంలో ఉద్యోగుల సమస్యల పైన మొదటి ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. మే 12 నుంచి మే 19 వరకు 175 మంది ఎమ్మెల్యేలను, 25 మంది ఎంపీలను ఉద్యోగ సంఘాల నేతలు కలవనున్నారు. మే 17న అనంతపురంలో రెండో ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని ఉద్యోగ సంఘాల నేతలు నిర్ణయించారు.
కలిసి రావాలని పిలుపు:మే 27న ఏలూరులో మూడో ప్రాంతీయ సదస్సు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 8న గుంటూరులో నాలుగో ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని సంఘాల నేతలు కోరారు. ఏపీ ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రెండు దశల ఉద్యమాల ఫలితంగా ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం జమ చేసినట్లు మంత్రుల కమిటీ చెప్పిందని నేతలు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రభుత్వం ఈ రోజు (మే 1) నుంచి ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా వరుసగా నిర్ణయాలు వెలువడతాయని ఇప్పటికే హామీ ఇచ్చింది. ఇప్పుడు మూడో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటనతో ప్రభుత్వం నుంచి స్పందన ఏంటనేది చూడాలి.












Click it and Unblock the Notifications