జగన్ సర్కార్ కు ఏపీ జేఏసీ అమరావతి నోటీసు..మార్చి 9నుంచి పోరు మొదలు..
ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి పెంచేందుకు ఉద్యమం చేపడుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ఇవాళ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గతంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ప్రశ్నించే పరిస్ధితులు కూడా లేవని, అందుకే ఉద్యమంలోకి దిగుతున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డికి ఇవాళ ఉద్యమ కార్యాచరణతో కూడిన నోటీసును అందజేశారు.
ఏపీలో సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో పాటు పలు కీలక సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగ సంఘాలు మరోసారి ఉద్యమానికి సిద్దమయ్యాయి. మార్చి 9 నుంచి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని ఇప్పటికే ప్రకటించిన ఏపీ జేఏసీ అమరావతి నేతలు.. ఇవాళ ఈ మేరకు సీఎస్ ను కలిసి నోటీసు ఇచ్చాయి. దీనిపై స్పందించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే మార్చి 9 నుంచి యథావిధిగా ఉద్యమంలోకి దిగుతామని నేతలు సీఎస్ కు తెలిపారు.

ఏపీ జేఏసీ అమరావతి ఇప్పటికే ప్రకటించిన కార్యాచరణ మేరకు మార్చి 9న నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలియజేయడంతో ఉద్యమం ప్రారంభం కానుంది. మార్చి 13, 14 తేదీల్లో భోజన విరామం సమయంలో ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. అలాగే మార్చి 21న సెల్ ఫోన్ వాడకుండా, పెన్ డౌన్ ప్రారంభిస్తామన్నారు. మార్చి24న అన్ని శాఖాధిపతుల కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నారు. మార్చి 27న కోవిడ్ లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తారు. ఏప్రిల్ 3వతేదీన గ్రీవెన్స్ లో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రెండో దశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications