ఉమాతో జగన్ పార్టీ ఎంపి: కెసిఆర్‌పై బొజ్జల
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. నీటి హక్కులకు సంబంధించిన జీవోలపై కెసిఆర్‌కు ఏ మాత్రం అవగాహన లేదని, అందుకే కెసిఆర్ అలా మాట్లాడుతున్నారని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
తెలంగాణ ప్రజలే కెసిఆర్‌ను ఛీకొడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ తన పద్ధతి మార్చుకోవాలని బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సూచించారు. రాయలసీమకు నీటి విడుదల విషయంలో కెసిఆర్ తీరును ఆయన విమర్శించారు.
శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉంచాలి

శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులు కొనసాగించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోరింది. ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి, శాసనసభ్యుడు రఘురామిరెడ్డి సోమవారంనాడు కలిశారు.
శ్రీశైలంలో నీటి మట్టం 850 అడుగులకన్నా తగ్గితే చెన్నైతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతాయని వారు ఆయనకు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లో పంటలు ఎండిపోకుండా ఉండాలంటే కనీసం జనవరి 15వ తేదీన వరకైనా 850 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని వారు అభిప్రాయపడ్డారు.
కృష్ణా రివర్ బోర్డులో రాయలసీమ నీటి సమస్యపై చర్చించాలని వారు దేవినేని ఉమను కోరారు. కర్నూలులో కృష్ణా రివర్ వాటర్ బోర్డును ఏర్పాటు చేస్తే అందుకు అనువుగా ఉంటుందని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications