జగన్, చంద్రబాబులే: సీమాంధ్రలో తమిళనాడు స్థితే
హైదరాబాద్: సీమాంధ్ర ఎన్నికల ఫలితాల అంచనాల మాట ఎలా ఉన్నా, పరిస్థితి అంచనాలు ఎలా ఉన్నా ఒక్కటి మాత్రం స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనేది మాత్రం అర్థమైంది. పరిస్థితి చూస్తుంటే ఇక్కడ తమిళనాడు పరిస్థితే వచ్చేట్లుంది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు అన్నాడియంకె, డిఎంకెలదే ప్రాబల్యం. జాతీయ పార్టీలు బిజెపి గానీ కాంగ్రెసు గానీ ఏదో ఒక ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడాల్సి ఉంటుంది.
సీమాంధ్రలో కూడా కాంగ్రెసు గానీ బిజెపి గానీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుందనేది ఖాయమైంది. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ, వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్యనే సీమాంధ్రలో పోటీ నెలకొని ఉంది. చాలా సర్వేలు ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొని ఉందని తెలియజేస్తున్నాయి. మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాత్రం తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని చెప్పారు.

సీమాంధ్రలో ఏ పార్టీ గెలిచినా కాంగ్రెసు జీరో అయిందనే విషయం ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు స్పష్టంగా రుజువు చేశాయి. సీమాంధ్రలో కొద్దిగానైనా సీట్లను కాంగ్రెసు సాధిస్తుందా, లేదా అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. బిజెపి ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్రంలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే మద్దతు ఇవ్వవచ్చు. పరిస్థితి అనుకూలిస్తే తృతీయ కూటమికి ప్రాణం పోయవచ్చు.
చంద్రబాబు నాయుడు ఉండగా, జగన్ బిజెపి నేతృత్వంలోని ఎన్డియెలో చేరడం సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ జగన్ ఇష్టపడినా చంద్రబాబు అడ్డుపడవచ్చు. అందువల్ల ఒకరు కాంగ్రెసు వైపు ఉంటే, మరొకరు బిజెపి వైపు ఉండాల్సిన పరిస్థితి.
తెలంగాణలో మాత్రం కాంగ్రెసు పరిస్థితి కాస్తా మెరుగ్గా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో అధికారం కోసం కాంగ్రెసు పోటీ పడుతుందనే అంచనాలు సాగుతున్నాయి. కొన్ని లోకసభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలు తెలియజేస్తున్నాయి. అయితే, తెరాసకే ఎక్కువ స్థానాలు వస్తాయనే అంచనాలున్నాయి. తాము రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలుంటే మద్దతు ఇస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పటికే స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణలో తెలుగుదేశం - బిజెపి కూటమి ఏ మేరకు బలాన్ని చాటుకుంటాయనే విషయంపై కాంగ్రెసు పరిస్థితి ఆధారపడి ఉండవచ్చు. వచ్చే ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటూ, తెరాస తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ పోతే కాంగ్రెసుకు కష్టకాలం ఎదురు కావచ్చు. ఏమైనా, ఈ ఫలితాలు జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి.












Click it and Unblock the Notifications