టీడీపీ ఉత్తరాంధ్ర చర్చావేదికపై బొత్స ఫైర్-రాజధాని అడ్డుకుంటున్నారని ఆగ్రహం
ఉత్తరాంధ్రలో వైజాగ్ రాజధాని నేపథ్యంలో అక్కడ వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో ఓ కొత్త సంస్ధను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్రలో ప్రజల ఓట్లు వేయించుకుని, అక్కడి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతున్నా,, గంగవరం పోర్టు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఈ సంస్ధను ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్రలో వైసీపీ వైఫల్యాల్ని టార్గెట్ చేసేందుకు టీడీపీ దీన్ని స్ధాపించింది. అయితే దీనిపై వైసీపీ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు.
విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికను ఏర్పాటు చేయడం పట్ల మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో వైజాగ్ రాజధాని వస్తుంటే ఓర్చుకోలేక టీడీపీ ఇలాంటి పోటీ సంస్ధల్ని ఏర్పాటు చేస్తోందని బొత్స ఫైర్ అయ్యారు. వైజాగ్ రాజధానికి వ్యతిరేకంగా కోర్టుల్లో స్టేలు తెచ్చుకున్న టీడీపీ.. ఇప్పుుడు ఉత్తరాంధ్ర చర్చా వేదికల పేరుతో డ్రామాలాడుతోందని బొత్స విమర్శించారు.

విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలకు ఇక్కడి అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా ఉత్తరాంధ్ర ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సీఎం జగన్ సహా వైసీపీ నేతలంతా ఎన్నో పోరాటాలు చేస్తున్నారని బొత్స తెలిరారు. ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేందుపకు ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇలాంటి వేదికల్ని ప్రజలు నమ్మబోరన్నారు.
విశాఖలో రాజధాని ఏర్పాటు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ తో పాటు మంత్రులపైనా రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను అదానీకి అమ్మేసుకోవడం, వైజాగ్ స్టీల్ ను కేంద్రం ప్రైవేటీకరించే ప్రయత్నాలు చేస్తుండటంతో వైసీపీ మరింత ఇరుకునపడుతోంది. దీంతో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ఇదే మంచి సమయంగా భావిస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక పేరుతో ముందుకొచ్చింది. ఎలాగో ఆయా సమస్యలపై ఉద్యమాలే జరుగుతున్నాయి కాబట్టి టీడీపీ ఫోరంకు మద్దతు కూడా లభిస్తోంది. ఇది అంతిమంగా వైసీపీకి ఇబ్బందికరంగా మారిందని మంత్రి బొత్స వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications