కాసానికి జ్ఞానోదయం అయ్యింది.. పవన్‌కు ఎప్పుడో?: అంబటి సెటైర్లు, బాబుపై హాట్ కామెంట్స్
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గుడ్‌బై చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ టీడీపీ జెండా పీకేస్తారని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేయడాన్ని ప్రస్తావించారు అంబటి రాంబాబు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని.. జ్ఞానేశ్వర్‌కు జ్ఞానోదయం అయ్యింది కాబట్టి రాజీనామా చేశారన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం పార్టీని తాకట్టు పెట్టడం అనైతికం అంటూ విమర్శించారు. ఇక ఏపీలోనూ టీడీపీ జెండా ఉండదన్నారు.

వచ్చే ఎన్నికల ముందో తర్వాతో ఏపీలోనూ జెండా పీకేస్తారని అంబటి అన్నారు. 1983లో ఎక్కడైతే ఎన్టీఆర్ జెండా ఎగురవేశాడో.. అక్కడ టీడీపీ జెండా పీకేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారన్నారు. ఎన్టీఆర్ ను చంపిన చేతులతోనే టీడీపీని కూడా చంపేస్తారని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది !
— Ambati Rambabu (@AmbatiRambabu) October 30, 2023
పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో ?@PawanKalyan
మరోవైపు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. 'జ్ఞానేశ్వర్ కి జ్ఞానోదయం అయింది ! పవన్ ఎప్పుడు పరిపక్వమౌతాడో ?' అంటూ అంబటి ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, తెలంగాణ టీడీపీకి సోమవారం కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేయవద్దన్నందుకే తాను పార్టీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత చంద్రబాబు పోటీ చేయవద్దన్నారని.. లోకేశ్‌కు 14 సార్లు ఫోన్ చేస్తే స్పందించలేదని జ్ఞానేశ్వర్ చెప్పారు. తాను కేడర్‌కు సమాధానం చెప్పలేకనే పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని జ్ఞానేశ్వర్ పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications