13 లక్షల మంది 5 కోట్ల ప్రజల్ని శాసిస్తారా ? ఉద్యోగుల పోరుపై మంత్రి అవంతి ఫైర్-షాకింగ్ కామెంట్స్
ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పోరు తీవ్రమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగులు పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఓవైపు కొత్త పీఆర్సీపై ఇచ్చిన జీవోల్ని అమలు చేసేస్తూనే మరోవైపు ఉద్యోగుల్ని చర్చలకు ఆహ్వానిస్తోంది. దీంతో చర్చలకు వెళ్లేందుకు ఉద్యోగసంఘాలు సిద్ధం కావడం లేదు. దీనిపై మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఉద్యోగులు మంత్రుల కమిటీతో పీఆర్సీపై చర్చలకు రాకపోవడంపై ఇవాళ మరో మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు.గతంలో ఉద్యోగులు పిఆర్సీ బావుందని చెప్పి పాలాభిషేకాలు చేశారని, కొద్ది గంటల తర్వాత వారిలో మార్పు వచ్చిందని అవంతి తెలిపారు. ప్రభుత్వం చెప్పినదానికి అంగీకరించి మళ్లీ ఎందుకు కాదన్నారని ఉద్యోగుల్ని ఆయన ప్రశ్నించారు.తమకు బేషజాలు లేవని, ముఖ్యమంత్రి ఒక్కరే ప్రభుత్వం కాదని, కార్యనిర్వహక వర్గం కూడా ఒక భాగమేనని అవంతి వ్యాఖ్యానించారు.

చర్చకు రాకపోతే ఎలా అని ఉద్యోగుల్ని మంత్రి అవంతి ప్రశ్నించారు. ఇలాంటి ఉద్యమాలు ఎప్పుడూ చూడలేదని ఆయన తెలిపారు. చర్చలకు వచ్చి వుంటే జీతాలు తగ్గవని లెక్కలు వేసి చూపించేవాళ్లమని మంత్రి అవంతి పేర్కొననారు. ఈపాటికి జీతాల బిల్లులు కూడా సిద్దమయ్యేవన్నారు. తాము చెప్పిందే కరెక్ట్ అనడంలేదని, ఉద్యోగుల అభ్యంతరాలను కూడా వారు ప్రస్తావించవచ్చని మంత్రి సూచించారు.
13 లక్షల మంది ఉద్యోగులు ఐదుకోట్ల మందిని శాసిస్తామంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. తుది చర్చలకు అనుగుణంగానే కొత్త పిఆర్సీ ఖరారు చేశామని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేయమని అడిగారని, ఇప్పుడు మళ్లీ వక్రీకరించి మాట్లాడుతున్నారని ఆర్టీసీ ఉద్యోగుల వ్యాఖ్యలపై మంత్రి అవంతి కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగులకు జీతంలో రూపాయి కూడా తగ్గదని, చర్చలకు పిలిస్తే రాకపోవడం ఏంటని ఆయన నిలదీశారు. ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications