ఉచిత బస్సుకు ముందే విద్యార్ధుల కష్టం తీర్చిన ఏపీ మంత్రి..!
ఏపీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తోంది. మధ్యాహ్నం సీఎం చంద్రబాబు విజయవాడలోనూ, మంత్రులు తమ సొంత జిల్లాల్లోనూ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే అంతకు ముందే రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం బనగానపల్లె పరిధిలో ఓ పల్లెలో విద్యార్ధుల కష్టం తీర్చారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ గతంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు పలు విజ్ఞప్తులు చేశారు. బందర్లపల్లి విద్యార్ధులు, గ్రామస్తులు అభ్యర్థన మేరకు తక్షణమే స్పందించి, ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి కోరారు.

దీంతో బందర్లపల్లి గ్రామానికి ఇవాళ ఆర్టీసీ బస్సు సేవలు ప్రారంభమయ్యాయి. మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి చొరవతో బందర్లపల్లి విద్యార్ధులకు ఆర్టీసీ రవాణా సదుపాయం లభించింది. మంత్రి చొరవతో ఇవాళ సమీపంలోని తాడిపత్రి బస్ డిపో నుంచి ఉదయం 8.30 గంటలకు , సాయంత్రం 4.15 గంటలకు అంకిరెడ్డిపల్లె నుండి బందర్లపల్లెకు బస్సు సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాఠశాల, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు, గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యపై సకాలంలో స్పందించి గ్రామానికి ఆర్టీసీ బస్సు కల్పించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డికి గ్రామస్తులు, విద్యార్ధులు కృతజ్ఞతలు తెలిపారు.
వాస్తవానికి ఇవాళ్టి నుంచి ఈ గ్రామంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సదుపాయం అందుబాటులోకి రాబోతోంది. ఆలోపే బస్సు సదుపాయం లేని పల్లెకు ఇలా సౌకర్యం కల్పించడం ద్వారా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు సైతం ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతోంది.












Click it and Unblock the Notifications