ఆ ఆరోపణలు నిరూపించు.. అచ్చెన్నాయుడికి బొత్స సత్యన్నారాయణ సవాల్!!
జగనన్న ఇళ్ళ నిర్మాణాలలో అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్సా సత్యన్నారాయణ ఎదురు దాడికి దిగారు. విజయనగరం జిల్లాలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్సా సత్యన్నారాయణ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఇళ్ల నిర్మాణం విషయంలో అవకతవకలు జరిగాయని అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన బొత్స సత్యనారాయణ ఇళ్ల వ్యవహారంలో ఇద్దరం కలిసి ఫీల్డ్ కి వెళదాం రావాలని, అచ్చెన్నాయుడు ఎక్కడకు వస్తానంటే తాను అక్కడికి వస్తానని, అచ్చెన్నాయుడు చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని బొత్ససత్యనారాయణ సవాల్ విసిరారు.

ఎన్ని ఇబ్బందులున్నా ఇళ్ళ నిర్మాణాల విషయంలో ముందుకే వెళ్తున్నాం
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టిడిపి నేతలకు మాటల దాడి చేయడం అలవాటుగా మారిందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏవేవో కథనాలు రాసి వాటి పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించాలని ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో మేము చెప్పలేదని పేర్కొన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి స్థలాన్ని, నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పామని వెల్లడించారు. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ రాజీ పడొద్దు అని చెప్పిన ఆదేశాల మేరకు ఏదో రకంగా ముందుకు వెళుతున్నామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

కావాలనే కరెంట్ సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు
టిడ్కో ఇళ్లపై టిడిపి అసత్య ప్రచారాలు చేస్తుందని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను టిడిపి భూతద్దం పెట్టి చూపిస్తుందని మండిపడిన బొత్స సత్యనారాయణ, ఎన్టీపీసీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య రెండు మూడు రోజులు మాత్రమే కొంత గ్యాప్ వచ్చిందని, ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు యధావిధిగా ఇస్తున్నామని పేర్కొన్నారు. సమస్య సమసిపోయిన తర్వాత కూడా కావాలని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్న బొత్స సత్యనారాయణ ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కరెంటు సమస్య లేదని తేల్చి చెప్పారు. కావాలంటే గ్రామాల్లోకి వెళదాం రండి అంటూ బొత్స సత్యనారాయణ టిడిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబులా అబద్దాలు మాట్లాడటం మాకు రాదు
జగనన్న ఇళ్ళు పిచ్చుక గూళ్ళులా ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని చెప్పిన బొత్స సత్యనారాయణ చంద్రబాబు లాగా అబద్ధాలు మాట్లాడటం తనకు రాదన్నారు. అలా ఏమైనా చెబితే తాను తలదించుకుంటాను అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారని పెద్ద ఎత్తున గొడవలు సృష్టిస్తున్నారని, క్లీన్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసే దిశగా విధివిధానాలను రూపొందించామని, రోజుకు రూపాయి, రెండు రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కానీ కొన్ని పత్రికలు దోచుకు తింటున్నట్టు చూపిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఉన్నప్పుడు పని చేయలేదని, ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే కడుపు మంట గా ఉందని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

వివేకా హత్యకేసుతో వైసీపీకి సంబంధం లేదు
పీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా టిడిపి నాయకులు చేస్తున్న విమర్శల పై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసు పై వైసిపి ప్రభ ఎంక్వైరీ వేసిందని గుర్తు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, ఈ కేసులో సిబిఐ అధికారులు, న్యాయస్థానం ఎవరి పని వారు చేసుకు పోతారని వెల్లడించారు. ఈ కేసుతో తమ పార్టీకి ఎటువంటి జోక్యం లేదని స్పష్టం చేశారు.

పీఆర్సి విషయంలో కూడా చంద్రబాబు అండ్ కో చాలా ఊహించుకున్నారు
ఉద్యోగుల సమ్మె విషయంలో కూడా చంద్రబాబు అండ్ కో ఎంతో ఊహించుకున్నారు అని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తీరా సమ్మె జరగకపోవడంతో చంద్రబాబు ఆయన మనుషులు నిరుత్సాహానికి గురయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములైన ఉద్యోగులు తమ సమస్య పరిష్కారానికి కమిటీ వేసుకొని, సమ్మె విషయంలో వెనక్కి తగ్గారని, సమస్యలు పరిష్కరించుకున్నారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం పేదల పట్ల వారి అవసరాల పట్ల చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్న బొత్స సత్యనారాయణ, రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎలా విధ్వంసం సృష్టించాలా అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు అంటూ మండిపడ్డారు.

త్వరలోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడతాం
ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదే సమయంలో ప్రత్యేక హోదా కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన కేంద్రంపై పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. మూడు రాజధానుల బిల్లుకు కొన్ని వ్యవస్థలు అడ్డంకిగా మారాయని త్వరలోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టి తీరుతామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడానికి డెడ్లైన్ ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications