పన్ను కట్టకపోతే ఆస్తుల జప్తును సమర్ధించుకున్న బొత్స- కొత్తేం కాదు, గతంలోనూ ఉందని వెల్లడి
ఏపీలో పన్నులు కట్టకపోతే ఆస్తుల్ని జప్తు చేస్తూ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ పన్నులు కట్టించుకునేవారని, కానీ ఇలా ఆస్తుల జప్తు పేరుతో బెదిరింపులు లేవనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ చర్యల్ని సమర్ధించారు.
రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట జరిగిన ఆస్తుల జప్తు ఘటనల్ని ఓ వర్గం మీడియా రాష్ట్రవ్యాప్తంగా జరిగినట్లు చూపుతోందని బొత్స అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది తమ ప్రభుత్వ విధానమని బొత్స తెలిపారు. అనధికారికంగా కుళాయి కనెక్షన్ వద్దని, అధికారికంగా కుళాయి కనెక్షన్ తీసుకోవాలని ప్రజలను కోరుతున్నట్లు బొత్స వెల్లడించారు. చట్టానికి సంబంధం లేకుండా, ఎక్కడో అనధికారికంగా జరిగే సంఘటనలకు ఈనాడు పత్రిక మద్దతు పలుకుతుందా అని బొత్స ప్రశ్నించారు.

ఎక్కడైనా వ్యవస్ధలను పటిష్టం చేయాలని కోరతారని, కుళాయి కనెక్షన్ రేట్లు అధికంగా ఉన్నాయని ఎవరైనా భావిస్తే.. వారి సమస్యలను స్ధానిక సంస్దల దృష్డికి తీసుకెళ్లవచ్చని, అలాకాకుండా, ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా మీడియా కథనాలు రాయకూడదని బొత్స హితవు పలికారు. పన్నుల కట్టకపోతే జప్తులు చేయటం అన్నది ఎప్పటినుంచో ఉందని బొత్స తెలిపారు. ఈ రోజు కొత్తగా వచ్చింది కాదన్నారు. ప్రజలని ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశం కానేకాదన్నారు.
స్ధానిక సంస్ధలను సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రంమగా చెల్లించాలి కదా అని బొత్స ఎదురు ప్రశ్నించారు.పన్నులు కట్టకపోతే.. చర్యలు తీసుకున్న ఘటనలు గత ప్రభుత్వాల హయాంలో కూడా ఎన్నో జరిగాయని, కానీ, అప్పుడు ఎందుకు ఇలాంటి వార్తలు ఈనాడు రాయలేదని ఆయన ప్రశ్నించారు. అంటే, ఆ పత్రిక మోటివ్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. బలవంతంగా పన్ను వసూలు చేయాలనిగానీ, ప్రజలను ఇబ్బంది పెట్టాలనిగానీ ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదన్నారు.












Click it and Unblock the Notifications