ఆ చట్టం ప్రకారమే పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెరిగాయి: దేవినేని
అమరావతి: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు వేసినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పారు. బుధవారం మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కలిసి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడారు.
దేశంలో 14 సాగునీటి ప్రాజెక్టులను కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించిందని ఆయన చెప్పారు. పోలవరంలాగా మరే ప్రాజెక్టు పనులూ జరగడంలేదని దేవినేని గుర్తుచేశారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్రం తీసుకోవడమే దీనికి కారణమని మంత్రి దేవినేని అభిప్రాయపడ్డారు.
కాంట్రాక్టర్‌ను తొలగిస్తే న్యాయ వివాదాలు వస్తాయని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. ఈ దృష్ట్యా 30లక్షల క్యూబిక్ మీటర్ల పనిలో కొంత భాగం తీసుకుని తాజాగా టెండర్లు పిలవాలని నిర్ణయించామని మంత్రి దేవినేని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు అంచనాలను పెంపు విషయమై వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం సరిగా లేదని దేవినేని ఉమా మహేశ్వర్‌రావు ప్రకటించారు. పెంచిన అంచనాల డబ్బును తానే తినేశానని వైసీపీ నేతలు నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు తప్పుబట్టారు.
కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస వ్యయం పెరగితే దానిని ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంచినట్లుగా చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న పదేళ్లలో పోలవరం ప్రాజెక్టుపై రూ.5,135కోట్లు ఖర్చు చేస్తే తాము మూడేళ్లలో రూ.7,329కోట్లు ఖర్చు చేశామని మంత్రి గుర్తుచేశారు. నిర్వాసితుల త్యాగంతోనే పోలవరం పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించిన విషయాన్ని దేవినేని ఉమామహేశ్వర్‌రావు ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications