జగన్ ప్రభుత్వాన్ని కించపరుస్తారా? కేసీఆర్, హరీశ్ రావుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ఏపీ మంత్రుల ఆగ్రహానికి కారణంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చేసిన తెలంగాణా సీఎంతో పాటు మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏపీని కించపరిచేలా బీఆర్ఎస్ నాయకులు ప్రసంగాలు చేయడం ఏమాత్రం సరికాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

దానికి బదులు తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులపై మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ మ్యానిఫెస్టోలో ప్రకటించారని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్, ఏపీని ఫాలో అయ్యే తెలంగాణ రాష్ట్ర నాయకులు కూడా ఏపీని విమర్శిస్తారా అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు మాట్లాడాలి అనుకుంటే మీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడితే మంచిదని సూచించారు.
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు , తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లను పోల్చి చూడాలని, ఎక్కడ అభివృద్ధి జరిగిందో అర్థమవుతుందని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని తెలంగాణలో కొనుగోలు చేస్తున్నామని కెసిఆర్ ఇటీవల ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో వ్యాఖ్యానించారు.
అంతకుముందు మంత్రి హరీష్ రావు కూడా హైదరాబాదును అమరావతిని పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ నేతలు నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదని, జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి గుడివాడ అమర్నాథ్ .












Click it and Unblock the Notifications