AP Agriculture Budget : రూ.41,436 కోట్లతో వ్యవసాయ బడ్జెట్-రైతు సంక్షేమమే ముఖ్యమన్న కాకాణి
ఏపీలో ఇవాళ వ్యవసాయ మంత్రి ప్రవేశపెట్టిన వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్డెట్ కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా రూపొందించారు.
అమరావతి : ఏపీలో రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో రూ.41436 కోట్ల వ్యయంతో ఆయన ఇవాళ వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక అంశాలున్నాయి.
ఇవాళ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్డెట్ లో రైతు భరోసా కేంద్రాల వద్ద బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు కావాల్సిన అన్ని సేవల్ని గ్రామాల్లోనే అందిస్తున్నామని, వారి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్బీకేలను మరింత పటిష్టంచేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వీటిని మరింతగా రైతుల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ ఛానళ్లు, మాసపత్రికలు ప్రారంభించినట్లు కాకాణి వెల్లడించారు.

రైతు భరోసా పథకం కింద ఇప్పటివరకూ రూ.6940 కోట్లు అందించినట్లు మంత్రి కాకాణి తెలిపారు. రైతులకు యూనివర్శల్ బీమా కల్పించిన ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. ఏపీ సీడ్స్ కు జాతీయ స్ధాయిలో అవార్డులు వస్తున్నాయన్నారు. విత్తనాల రాయితీకి రూ.200 కోట్లు కేటాయించామని, ఆర్బీకేల ద్వారా రూ.450 కోట్ల ఎరువుల సరఫరా చేస్తున్నామన్నారు. ఆర్బీకేల్లో 50 వేల టన్నుల ఎరువుల్ని నిల్వ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 6.01 లక్షల కోట్ల రైతు రుణాలిచ్చామని, దీంతో 9 లక్షల మందికి మేలు జరిగిందన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటు చేశామని, 3.5 లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్పేయర్లు అందించామని కాకాణి పేర్కొన్నారు. డ్రోన్లతో పురుగుమందులు పిచికారీ చేయిస్తున్నామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు 10వేల డ్రోన్లు అందిస్తున్నామన్నారు. చిరు ధాన్యాల సమగ్ర సాగు విధానం తీసుకొచ్చి, హెక్టార్ కు 6 వేలు ప్రోత్సాహకం ఇస్తున్నామన్నారు. పట్టు పరిశ్రమ ప్రగతి పథంలో నిలిపామని, ధరల స్ధిరీకరణ నిధితో రైతుల్ని ఆదుకుంటున్నామని కాకాణి తెలిపారు.













Click it and Unblock the Notifications