అమరావతి సభపై మంత్రి పెద్దిరెడ్డి విసుర్లు-రైతు ఉద్యమం బూటకం-విపక్షాల ఐక్యత నాటకం
తిరుపతిలో ఇవాళ జరిగిన అమరావతి రైతుల సభపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సభ ముగిశాక దీనిపై ఆయన రేణిగుంట విమానాశ్రయంలో స్పందించారు. అమరావతి ప్రాంతంలో వేల ఎకరాలు భూములు కొనుక్కొని, వాటిని కాపాడుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న ఉద్యమమేకానీ, అది రైతుల ఉద్యమం కానేకాదన్నారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, భూములు కొన్నవారు వాటిని పరిరక్షించుకోవడం కోసం యాత్రలు చేస్తున్నారని, సభలు పెడుతున్నారని ఆరోపించారు. ఈరోజు ఆ భూముల ధరలు పడిపోయే సరికి రోడ్ల మీదకు వచ్చి ఒకే రాజధాని అంటున్నారన్నారు. పైగా న్యాయ స్థానం ఇస్తుందని చంద్రబాబే చెప్పకనే చెబుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అందుకే న్యాయస్థానం నుంచి దేవస్థానం అని ముందే ఒక డైరెక్షన్ ఇస్తున్నారన్నారు.. వెంకటేశ్వర స్వామి కూడా మద్దతు ఇస్తున్నాడన్నట్టుగా మాట్లాడుతున్నారని పెద్దిరెడ్డి ఆక్షేపించారు. దేవుడు ఏమైనా పాదయాత్ర చేయమన్నాడా..?. పాదయాత్ర చేయమని చంద్రబాబే చెప్పాడన్నారు.
అమరావతి రైతుల పేరుతో చేస్తున్న ఉద్యమంలో ... రైతులు ఎవరున్నారు.?. కేవలం ఆ ప్రాంతంలో భూములు కొన్నవారు, భూములు ఇచ్చినవారే ఉన్నారని పెద్దిరెడ్డి తెలిపారు. వారంతా భూముల ధరలు పడిపోయానన్న బాధతో బయటకు వచ్చి యాత్రలు చేస్తూ, సభలు పెట్టి, గొంతు చించుకుని మాట్లాడుతున్నారు. అమరావతిని పరిరక్షిస్తాను అని చంద్రబాబు తిరుపతి వచ్చి చెబుతున్నాడు. ఆయన ఏం పరిరక్షిస్తాడు, ఎవరి ప్రయోజనాలు పరిరక్షిస్తాడని ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులను అడ్డు పెట్టి, లక్ష కోట్లకో.. రెండు లక్షల కోట్లకో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు అని చంద్రబాబు కలలుగన్నాడని,. 2019లో వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో, తన వ్యాపారాన్ని జగన్ గారు అడ్డుకున్నారన్నదే ఆయన బాధ అంతా అని పెద్దిరెడ్డి తెలిపారు.

చంద్రబాబు అమరావతి మాత్రమే రాజధాని కావాలని కోరుకుంటున్నాడని, అది మీ విధానంగా మీరు చెప్పుకోండి. కానీ, మీరు ఎన్ని చెప్పినా, మిమ్మల్ని ఛీ కొట్టి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలన్న జగన్ మోహన్ రెడ్డిగారి విధానానికే ప్రజలు మద్దతు ఇచ్చి, ప్రతి ఎన్నికల్లోనూ గెలిపిస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. ఆరోజు హైదరాబాద్ లో తప్పు చేసినట్టే.. అమరావతిలోనూ చేయాలని చంద్రబాబు భావించాడని పెద్దిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో కూడా ఒక ప్రాంతంపైనే దృష్టి కేంద్రీకరించి, హైటెక్ సిటీని చూపించి, సైబరాబాద్ ను నిర్మిస్తున్నట్టు ప్రచారం చేసుకుని, దాని చుట్టూ ఒకే సామాజికవర్గం చేత భూములు కొనిపించి, లబ్ధి చేకూర్చడంతో, ఆయన మనుషులంతా వేల కోట్లకు పడగలెత్తారు. అమరావతిలో కూడా అదే స్కీమ్ అమలు చేయాలనుకుంటే జగన్ మోహన్ రెడ్డిగారు అధికారంలోకి రావడం వల్ల అది బెడిసికొట్టింది. అదే వారి బాధంతా అని అన్నారు.
చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని, ఆయన చెబుతున్నట్లుగా అమరావతిలో ఆయన బినామీ భూములను పరిరక్షించుకోవడం సాధ్యంకాదని పెద్దిరెడ్డి తెలిపారు. రైతు ఉద్యమం అన్నది బూటకమని, అందులో రైతులు ఎవరూ లేరన్నారు.. వారంతా చంద్రబాబు చెప్పినట్టు, చెప్పినచోట భూములు కొన్నవారే, ఈరోజు భూముల ధరలు పడిపోయేసరికి నిరాశ, నిస్పృహతో పోరాటం చేస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు.
తిరుపతి సభకు వచ్చిన పార్టీల కలయిక అనైతికని పెద్దిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడైనా కలిసి ఒకే వేదిక మీద వచ్చాయా.. బీజేపీ, కమ్యూనిస్టులు ఎప్పుడైనా ఒకే వేదిక మీదకు వచ్చాయా.. లేదు. ఈరోజు ఎందుకు వచ్చారంటే, బలమైన నాయకుడిగా పరిపాలన చేస్తోన్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఎదుర్కోలేక, ఆయన్ని అధికారం నుంచి దించేయాలన్న ఒకే ఒక్క ఎజెండాతోనే వారు కలిశారు. కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ప్రజా బలం ఉన్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఏమీ చేయలేరన్నారు.












Click it and Unblock the Notifications