బీజేపీ సభపై పేర్ని విసుర్లు-చంద్రబాబు తలల్లో బీజేపీ ఒకటి-అందుకే బాబు అజెండా అమలు
ఏపీలోని విజయవాడలో ఇవాళ బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగ్రహ సభపై రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని సెటైర్లు వేశారు. చంద్రబాబు ఎజెండానా బీజేపీ ఎజెండా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రజాగ్రహ సభ ఓ ప్రహసనని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం భావజాలాన్ని వ్యక్తపరిచే సభని తెలిపారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో జాతీయ పార్టీ అయిన బీజేపీ ఎలా ఉందని పేర్నినాని ప్రశ్నించారు.
టీడీపీ నేతలపై సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు రాష్ట్ర బీజేపీ శాఖను లీజుకిచ్చారా.. లేదా అని కాషాయ నేతల్ని పేర్ని ప్రశ్నించారు. మీకు ఏం అధికారం ఉందని ఐపీఎస్ లను టెలిస్కోప్ తో చూస్తాం, రీకాల్ చేస్తాం అని మాట్లాడతారంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను పేర్నినాని నిలదీశారు. 2019 దాకా బీజేపీకి అమరావతి స్కాం క్యాపిటల్ అని, కానీ ఈరోజు కాపాడతాం, పోరాడతాం అంటారా అని పేర్ని ప్రశ్నించారు.

గతంలో పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ప్రధాని మోడీ అన్నారని, దానిపై ఈడీతో విచారణ ఎందుకు చేయించరని పేర్నినాని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలు ఎన్ని నెరవేర్చారో బీజేపీ నేతలు చెప్పాలని పేర్ని డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతాం అన్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైందని ఆయన అడిగారు. మద్యం ధరలు పెరిగినందుకు ప్రశ్నలు వేయడం కాదు, కేంద్రంలో అధికారంలో ఉండి పెట్రో, డీజిల్ ధరలు ఎందుకు పెంచారో చెప్పాలని బీజేపీ నేతల్ని పేర్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బ్రాందీ రేట్లు పెరిగినందుకు కాదు.. నిత్యావసర సరుకులు, ఎరువుల ధరలు పెరిగినందుకు బీజేపీ బాధ పడాలని పేర్ని సెటైర్లు వేశారు.
టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్నవారికే ఆగ్రహం తప్పితే ప్రజాగ్రహం ఎందుకు ఉంటుందని మంత్రి పేర్నినాని ఆక్షేపించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీదని, రైతు పక్షపాతి ప్రభుత్వం వైయస్ఆర్సీపీది అని పేర్ని అన్నారు. జీడీపీలో 21 శాతంపైగా భారతదేశం అప్పు ఉందని, ఇందుకు కారణం కేంద్రంలోని బీజేపీ కాదా అని ఆయన ప్రశ్నించారు. రూ. 135 లక్షల కోట్లకు పైగా దేశాన్ని అప్పుల్లోకి తీసుకువెళ్ళింది బీజేపీ కాదా అని పేర్ని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పుకు లెక్క ఉందన్నారు.
మరోవైపు ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, జనసేనల జెండాలు వేరుకానీ.. ఆ జెండా కర్రల రంగు మాత్రం పసుపేనని పేర్ని సెటైర్లు వేశారు. రాజకీయ రావణాసురుడిలాంటి చంద్రబాబుకు ఉన్న తలల్లో బీజేపీ కూడా ఒకటన్నారు. బ్రాందీ బుడ్డి రేటు.. సినిమా టికెట్ల ధరల మీద శ్రద్ధ తప్పితే ప్రజల మీద లేదా అని బీజేపీ నేతలకు ఆయన ప్రశ్నించారు.
భారతీయ జనతా పార్టీది.. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడిపేవారిని నడిరోడ్డుపై నిలబట్టే లెక్కేగనుక అయితే చంద్రబాబు నాయుడును ఎందుకు వదిలేశారని పేర్నినాని ప్రశ్నించారు. ఆయనను ఎందుకని బజారులో పెట్టలేదన్నారు. నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి, కేంద్రంలో అధికారం అనుభవించి, కేవలం ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు బ్లాక్‌మెయిల్ చేసింది ఎవరు? అటువంటి బాబును ఏం చేశారని అడిగారు.












Click it and Unblock the Notifications