అమరావతి పనుల డేట్ వచ్చేసింది-నారాయణ కీలక ప్రకటన..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా అమరావతి పనుల పునఃప్రారంభం మాత్రం ఇంకా జరగలేదు. ఇదిగో..అదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన అమరావతి పనుల్ని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ప్రకటించారు. అలాగే వచ్చే వారం అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతాయన్నారు.
ఈ నెల 12 నుంచి 15 మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్నట్లు మంత్రి నారాయణ అప్ డేట్ ఇచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుందన్నారు. మొదటి దశలో 40వేల కోట్లు విలువైన పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఆ తర్వాత దశల వారీగా మిగతా పనులు చేపడతామన్నారు. మరోవైపు ప్రజల డబ్బుతో రాజధాని కడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మరోసారి నారాయణ ఖండించారు.

ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. రాజధానిపై మీ స్టాండ్ చెప్పమంటే బొత్స తర్వాత చెప్తాను అంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం లో మూడు రాజధానులు అని మూడు ముక్కలు ఆడారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వలన రాజధాని టెండర్లు అలస్యం అయ్యాయని, మూడేళ్లలో అమరావతి రాజధాని పనులు పూర్తవుతాయని తెలిపారు. ఘోస్ట్ రాజధాని అని వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని ప్రకటనలు చేసినా ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. అమరావతికి రుణాలు ఇస్తామన్న ప్రపంచబ్యాంకు, ఏడీబీ వంటి సంస్థలు నిధుల విడుదల ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులేవీ రాకపోవడంతో ఈసారి బడ్జెట్ లోనే 6 వేల కోట్లను కేటాయించారు.












Click it and Unblock the Notifications