రుషికొండలో అన్నీ సక్రమమే-రాజధాని అడ్డుకునేందుకే బాబు, పవన్ కుట్రలు-రోజా ఫైర్..
వైజాగ్ లో రుషికొండకు నిన్న జనసేనాని పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటన ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టించింది. రుషికొండకు వెళ్లి పవన్ చేసిందేమీ లేదు కానీ.. ఆ పేరుతో జరిగిన హంగామా మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ నిప్పులు చెరిగారు. ఆయనతో పాటు విపక్ష నేత చంద్రబాబుపైనా రోజా తిరుపతిలో విమర్శలు గుప్పించారు
విశాఖపై విషం చిమ్మడమే బాబు, పవన్ లక్ష్యమని మంత్రి ఆర్కే రోజా తెలిపారు. అక్కడికి పరిపాలన రాజధాని రావొద్దనది వారి ఉద్దేశమన్నారు. రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరగడం లేదన్నారు. కోర్టు ఆదేశాలకు లోబడే, అక్కడ అభివృద్ధి పనులు జీ ప్లస్ వన్‌తో ఏడు భవనాలకు అనుమతి ఇచ్చారని రోజా తెలిపారు. అయినా 4 భవనాలు మాత్రమే అక్కడ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌తో సహా అన్ని అనుమతులు ఉన్నాయన్నారు.

రుషికొండపై కేవలం 139 చెట్లు మాత్రమే తొలగించామని ఆర్కే రోజా తెలిపారు. అన్ని అనుమతులతోనే ఆ చెట్లు తీసేశామన్నారు. ఇంకా ఆ కొండపై 13 వేల మొక్కలు నాటామని వెల్లడించారు. ఇవేవీ తెలుసుకోకుండా అదేపనిగా నిందిస్తున్నారని పవన్ పై మండిపడ్డారు. నాడు తన లగ్జరీ కోసం బాబు విచ్చలవిడి వ్యయం చేశారని రోజా ఆరోపించారు.ప్రజాధనం వందల కోట్లు యథేచ్ఛగా దుబారా చేశారన్నారు. అయినా ఏనాడూ పవన్‌కళ్యాణ్ ప్రశ్నించలేదన్నారు.
సీఎం జగన్ తాడేపల్లిలో సొంతంగా ఇల్లు కట్టుకున్నారని ఆర్కే రోజా తెలిపారు. సీఎం అయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటున్నారన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ ఎవరికీ ఇక్కడ ఇళ్లు లేవని రోజా గుర్తుచేశారు. పక్క రాష్ట్రంలో ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వారికి ఇక్కడి ప్రజల యోగక్షేమాలు అవసరం లేదన్నారు. చంద్రబాబు మాట్లాడినట్లు, విమర్శించినట్లుగానే పవన్‌కళ్యాణ్ కూడా మాట్లాడుతూ పవర్‌స్టార్‌గా కాకుండా, రీమేక్ స్టార్‌గా మారిపోయారన్నారు.












Click it and Unblock the Notifications