దసరా లోగా ఆ ఎన్నికలు.. ఏపీ మంత్రి కీలక ప్రకటన..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఎన్నికల నిర్వహణకు కూటమి సర్కార్ సిద్దమవుతోంది. ఇందులోనూ నెగ్గి సత్తా చాటుకోవాలని కూటమి పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ఇవాళ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. దసరా లోగా ఈ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఆమె ప్రకటించారు.
రాష్ట్రంలో చేనేత సహకార సంఘాల బలోపేతానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారని మంత్రి సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా సహకార సంఘ ఎన్నికలు నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. దసరాలోగా చేనేత సహకార సంఘ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. నూతన చేనేత సహకార సంఘాల ఏర్పాటుతో పాటు నిద్రావస్థలో ఉన్న సంఘాలను క్రీయాశీలకంగా పనిచేసేటట్లు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చేనేతలకు త్వరలో హెల్త్ ఇన్స్యూరెన్స్ అమలు చేయనున్నామన్నారు. చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, చేనేత దుస్తుల అమ్మకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చిన నేతన్నలతో మంత్రి సవిత భేటీ అయ్యారు. చేనేత రంగ అభివృద్ధికి సూచనలు, ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. నూతన డిజైన్ల తయారీలో శిక్షణ ఇస్తున్నామన్నారు. తయారైన ఉత్పత్పులకు మార్కెట్ సౌకర్యం కల్పించేలా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మినీ కస్టర్లు, మెగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 92,724 మందికి రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం నేతన్నల నుంచి ఆప్కో ద్వారా ఆరు నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇకపై మూడు నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. నేతన్నలకు బకాయిలను కూడా విడతలవారీగా చెల్లించున్నామన్నారు. త్రిఫ్ట్ పథకం కింద కేటాయించిన రూ.5 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ పార్కుల్లో యూనిట్ల స్థాపనకు నేతన్నలకే పెద్దపీట వేస్తున్నామన్నారు. వర్క్ షెడ్ల ఏర్పాటుకు చేయూతనందిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో చేనేతలకు అదనంగా రూ.50 వేలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్.హెచ్.డి.ఎస్. రీజనల్ కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు.
90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు అందజేస్తామని, సీఎం చంద్రబాబుతోనే చేనేతలకు స్వర్ణయుగమని మంత్రి సవిత తెలిపారు. చేనేత దుస్తులకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నాయన్నారు. రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒకరోజు చేనేత దుస్తులు తప్పనిసరిగా ధరించేలా రెండు ప్రభుత్వాలు త్వరలో ఓ పిలుపునివ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి నిధులు కేటాయింపు పెంచేలా సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నామన్నారు.












Click it and Unblock the Notifications