ఏపీ కేబినెట్ భేటీ-లెటర్ హెడ్లతో వెళ్లిన మంత్రులు-అక్కడే రాజీనామాల సమర్పణ
ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ అమరావతి సచివాలయంలో జరుగుతోంది. జగన్ కేబినెట్ లోని మంత్రులకు ఇదే చివరి సమావేశం. ఈ భేటీ తర్వాత మంత్రులు తమ రాజీనామాలు సమర్పించనున్నారు. వీటిని సీఎం జగన్ గవర్నర్ కు పంపి ఆమోదం తీసుకున్నాక ఈ నెల 11 న కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది.
ఇవాళ జరిగే కేబినెట్ భేటీ మంత్రులకు చివరిది కావడంతో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నట్లు కనిపిస్తోంది. సచివాలయానికి రాగానే తమ తమ ఛాంబర్లకు వెళ్లిన మంత్రులు అక్కడే కాసేపు గడిపిన తర్వాత కేబినెట్ భేటీకి బయలుదేరి వెళ్లారు.

అలాగే ఇవాళ సీఎం జగన్ కు కేబినెట్ భేటీ తర్వాత రాజీనామాలు సమర్పించాలని ఆదేశాలు రావడంతో తమ లెటర్ హెడ్లను కూడా మంత్రులు తీసుకుని వెళ్లారు. ఇవాళ కేబినెట్ లో నిర్ణయాలు తీసుకున్న తర్వాత.. భేటీ ముగుస్తుంది. ఆ తర్వాత మంత్రులను సీఎం జగన్ రాజీనామాలు కోరతారు. అనంతరం వారు తమ లెటర్ హెడ్లపై అక్కడే రాజీనామాలు చేసి బయటకు రానున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే తొలిసారి కేబినెట్ లో చోటు దక్కించుకున్న వీరందరికీ అప్పట్లోనే జగన్ రెండున్నరేళ్ల పదవీకాలం మాత్రమే ఉంటుందని, మిగతా వారికి అవకాశం ఇచ్చేందుకు వీలుగా 90 శాతం మందిని తప్పిస్తామని కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఆ విషయాన్నే మంత్రులు గుర్తు చేసుకుంటున్నారు. మంత్రి పదవులు పోతున్నందుకు తమకు ఎలాంటి బాధ లేదని వారు చెప్తున్నారు. మంత్రులుగా చివరి రోజు కావడంతో కాస్త ఉద్వేగానికి గురవుతున్నట్లు మాత్రమే మంత్రులు చెప్తున్నారు. సమాచార మంత్రి పేర్నినాని అయితే జర్నలిస్టులతో కలిసి ఫొటోలు దిగుతూ కనిపించారు. మిగతా మంత్రులు కూడా తమ పేషీల్లో సిబ్బందిని పలకరిస్తూ కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications