సెప్టెంబర్ చివరి కల్లా తేల్చేస్తాం-వైసీపీకి మంత్రి నారాయణ మరో హెచ్చరిక..!
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వైసీపీ టార్గెట్ గా కదులుతున్నారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఓ కీలక అక్రమాల వ్యవహారంపై ఇప్పటికే విచారణకు ఆదేశించిన ఆయన.. త్వరలో దాని రిపోర్ట్ వస్తుందని, ఆ తర్వాత వైసీపీ నేతల సంగతి తేల్చాస్తామని ఇవాళ మరోసారి హెచ్చరించారు. దీంతో వైసీపీ టార్గెట్ గా నారాయణ చేస్తున్న హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి.
రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన నేతలు అడిగిందే తడవుగా టీడీఆర్ బాండ్లు జారీ చేసేసింది. దీంతో వైసీపీ నేతలు భారీ ఎత్తున లబ్ది పొందారని భావిస్తున్న కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వీటిపై పోకస్ పెట్టింది. రాష్ట్రంలోని పలు నగరాల్లో టీడీఆర్ బాండ్ల జారీ ద్వారా వైసీపీ నేతలకు జరిగిన లబ్దిని తేల్చేందుకు విచారణకు ఆదేశించింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా జారీ అయిన టీడీఆర్ బాండ్ల విలువ ఎంత, వాటిలో వైసీపీ నేతలకు జరిగిన లబ్ది ఎంతన్న దానిపై విచారణ జరుగుతోంది.

టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని, సెప్టెంబరు చివరినాటికి అక్రమాల నిగ్గు తేలుస్తామని మంత్రి నారాయణ ఇవాళ తిరుపతిలో స్పష్టం చేశారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. టీడీఆర్ బాండ్లలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, వైసీపీ పాలనలో అవినీతిని కొత్త పుంతలు తొక్కించారని మంత్రి నారాయణ విమర్శించారు. అటు పురపాలక శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సెప్టెంబరు 13న రాష్ట్రంలో మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని మరోసారి తెలిపారు.












Click it and Unblock the Notifications