ఏపీలో కొత్త పెన్షన్లకు భారీ డిమాండ్..! 5 రోజుల్లోనే 6.81 లక్షలు..! గడువు పెంపు ?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ప్రభుత్వం... ఆ లోపు కొత్త పెన్షన్లను (New Pension) మంజూరు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తుల ప్రక్రియను ఈ నెల 7వ తేదీన ప్రారంభించింది. దీంతో ఎప్పటినుంచో కొత్తగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారంతా సచివాలయాలకు క్యూ కట్టారు. దీంతో పెన్షన్ దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి..
కేవలం ఐదు రోజుల్లోనే కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 6.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్ల కోసం అత్యధికంగా 3.76 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. వితంతు పింఛన్ల కోసం 1.65 లక్షల దరఖాస్తులు, దివ్యాంగుల పింఛన్ల కోసం 1.09 లక్షల దరఖాస్తులు ఇచ్చారు. డప్పు కళాకారుల నుండి 5,655 దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఈ నెల 16 వరకూ ఉంది. ఆ లోపు ఈ సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.

అయితే మధ్యలో మూడు రోజులు సెలవు దినాలు రావడంతో అప్లికేషన్ల ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉంది. సచివాలయాలకు కూడా సెలవులు రావడంతో దరఖాస్తుల స్వీకరణ నెమ్మదించనుంది. అలాగే పెన్షన్ల దరఖాస్తులకు సమర్పించాల్సిన పత్రాల కోసం జనం ఇతర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వాటికీ సెలవులు రావడంతో ఆ పత్రాలు కూడా ఆలస్యం కానున్నాయి. దీంతో కొత్త పెన్షన్ల దరఖాస్తుల కోసం ఈ నెల 16వరకూ ఇచ్చిన గడువును పెంచాలంటూ లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది.














Click it and Unblock the Notifications
