తెలంగాణ ఉద్యోగులు వేధిస్తున్నారు: ఏపీ ఎన్జీఓలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఉద్యోగులు తమను వేధిస్తున్నారని.... వారి నుంచి తమకు, తమ ఆస్తులకు రక్షణ కల్పించాలని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.
సోమవారం ఏపీఎన్జీఓ నేతలు హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో ఏపీ ఉద్యోగులు అభద్రతా భావంతో జీవించాల్సి వస్తుందని, గవర్నర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆస్తి అయిన ఏపీఎన్జీఓ హోంలో వాటా కావాలంటున్నారని ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు.

ప్రతిదానికి ఏపీఎన్జీఓ హోంపై దాడి చేస్తున్నారని, గత నెల 16న టీఎన్జీఓ సభ్యులు కొంతమంది తమ కార్యాలయంపై దాడిచేశారని ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఏపీఎన్జీఓ హోంలో నిర్వహించాలన్న టీఎన్జీఓల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
వారికి హక్కు లేని ఏపీఎన్జీఓ హోంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవం జరిపితే గట్టిగా ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. తాము ఏపీఎన్జీఓ హోంలో నవనిర్మాణ దీక్ష చేపట్టాలని భావించామని, అందువల్ల ఏపీఎన్జీఓ హోంకు, తమకు భద్రత కల్పించాలని గవర్నర్‌ను నరసింహన్‌ని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం భద్రత కల్పించకపోతే ఏపీ ప్రభుత్వం అయినా భద్రత కల్పించేలా ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. ఈ విషయంపై తెలంగాణ హోంమంత్రి కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన అశోక్‌బాబు తమ వినతిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.












Click it and Unblock the Notifications