ఏపీ ప్రజలకు అన్ని సేవల కోసం త్వరలో ఏపీ వన్ యాప్.. 150 సేవలతో ఆవిష్కరణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి డిజిటల్ సేవలపైన ప్రత్యేకమైన దృష్టి సారించింది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారికి కావాల్సిన సేవలను ఆన్ లైన్ లోనే పొందేలా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్ ఫారమ్ ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఇప్పటికే వెయ్యికిపైగా సేవలను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.
ఏపీ ప్రజల కోసం మొబైల్ అప్లికేషన్ యాప్ ఏపీ వన్ యాప్
దీంతో పాటు ఇప్పుడు ప్రజలకు ఒక మొబైల్ అప్లికేషన్ యాప్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రభుత్వ సేవలన్నీ ప్రజలు తమ ఇంటి నుంచే సులభంగా పొందేలా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ సర్కార్ పని చేస్తుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సీఈఓ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు. త్వరలో ఏపీలో ప్రజల కోసం ఏపీ వన్ మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు.

మనమిత్ర వాట్సాప్ సేవ కు మంచి ప్రజాదరణ
దీని వినియోగంపై అధికారులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌ను నేడు ఆయన ప్రారంభించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అడ్డంకులు లేకుండా సేవలు అందుకోవాలన్నది ప్రభుత్వ ఆశయమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ సేవ ఇప్పటికే ప్రజాదరణ పొందిందన్నారు.
మరింత సులభంగా సేవలు అందించాలని ఏపీ వన్ యాప్
అయినా ఇప్పుడు ఏపీ వన్ యాప్ ద్వారా మరింత సులభంగా సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మన మిత్ర ఇది వాట్సాప్ ఆధారిత గవర్నెన్స్ ప్లాట్ ఫారమ్. ఇందులో సర్టిఫికెట్లు, కరెంట్ కనెక్షన్లు వంటి సేవలు ఒక్కోసారి చాలామందికి సంక్లిష్టంగా ఉండేవని, ఇప్పుడు టెక్నాలజీతో వాటిని సరళతరం, సులభతరం చేస్తున్నామని చెప్పారు.
త్వరలోనే 150 సేవలతో యాప్
త్వరలోనే ఈ ఏపీ వన్ యాప్‌ను 150 సేవలతో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తర్వాత అవసరమైన సేవల సంఖ్య పెంచుతామని, సెర్చ్ బార్, తెలుగు-ఇంగ్లీష్ భాషల సదుపాయం, అన్ని ధృవపత్రాలు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అధికారులు ఈ యాప్‌పై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు ప్రయోజనాలు వివరించాలని సూచించారు.













Click it and Unblock the Notifications