మంత్రులకు టార్గెట్: ముంచినా తేల్చినా వారిదే బాధ్యత: సీఎం జగన్ న్యూ స్ట్రాటెజీ..?
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ఆరంభం కాబోతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలపై కసరత్తు చేపట్టింది. మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటోంది. ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకునే పంచాయతీలకు భారీగా నజరానాలను ప్రకటించడం ఇందులో భాగమే. ఇక- తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన దీన్ని వ్యతిరేకిస్తోన్నాయి. ఏకగ్రీవ విధానాన్ని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చాయి.

ఎన్నికలపై ఉత్కంఠత
ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నాయి. ఏకగ్రీవాలను నిరోధించడానికి తమ వంతు ప్రయత్నాలు ఆరంభించాయి. బీజేపీ-జనసేన పార్టీల నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నాయి. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ.. ఏకగ్రీవాల కోసం కుట్ర పన్నిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఈ పరిణామాల మధ్య పంచాయతీ ఎన్నికల నిర్వహణ.. ఎలా ఉండబోతోందనే ఉత్కంఠత ఏర్పడింది.

జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు టార్గెట్లు..
టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యంతరాలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. అధికార వైఎస్సార్సీపీ తన పని తాను చేసుకుంటూ పోతోంది. అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకోవడానికి వ్యూహాలను రూపొందించుకుంటోంది. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకు టార్గెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో 80 నుంచి 90 శాతం మేర పంచాయతీలను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని వారికి నిర్దేశించినట్లు సమాచారం. ఏకగ్రీవం సాధ్యం కాని పంచాయతీలపై ఎన్నికల ద్వారా గెలుపుబావుటాను ఎగురవేయాల్సిందేనని, దానికి అనుగుణంగా వ్యూహాలను రూపొందంచుకోవాలంటూ జగన్.. వారికి విస్పష్టంగా ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఇన్‌ఛార్జ్ మంత్రులు జిల్లాల్లోనే మకాం..
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహించేవే అయినప్పటికీ.. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులే విజయం సాధించాలనే పట్టుదలను మంత్రులు కనపరుస్తున్నారు. తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాలను పన్నుతున్నారు. ఎమ్మెల్యేల సహకారంతో పార్టీ బలంగా, గెలిచే అవకాశం లేని పంచాయతీలపై ఫోకస్ పెట్టారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు జిల్లాల్లోనే మకాాం వేయనున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా షెడ్యూల్‌ను రూపొందించుకుంటున్నారు.

సంక్షేమ పథకాలపైనే
జగన్ సర్కార్ అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలే తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థులను గెలిపిస్తాయనే ధీమా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా స్థాయి నేతల్లో వ్యక్తమౌతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే నవరత్నాలతో సహా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను 90 శాతం మేరకు అమలు చేయడంపై భరోసా ఉంచుకున్నారు. వలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాలు, సకాలంలో పింఛన్ల పంపిణీ, అన్ని రకాల సంక్షేమ పథకాల ప్రవేశపెట్టడం వంటి చర్యలు తమకు మెజారిటీ పంచాయతీలను తెచ్చిపెడుతాయని భావిస్తున్నారు.