' ఛీ కొడుతున్నారు.. ప్రభుత్వంపై తిరుబాటు చేసేలా ప్రజలు'
హైదరాబాద్ : గడపగడపకు వైసీపీ కార్యాచరణ ఎంతమేర ఫలితాన్నిస్తుంది అనేదానిపై నేటి ఉదయం సమీక్ష సమావేశం జరిగింది. అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో.. ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పాటు, భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యల గురించి జగన్ ఆయా జిల్లాల నేతలతో చర్చించినట్లు సమాచారం.
ఇకపోతే లోటస్ పాండ్ లో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత తమ్మినేని సీతారాం.. 'రాష్ట్ర ప్రజలంతా టీడీపీ ప్రభుత్వాన్ని ఛీ కొడుతున్నారని' మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో గడపగడపకు వైసీపీ కార్యక్రమం తొలిదశలోనే విజయం సాధించిందని అన్నారు సీతారాం.

గడపగడపకు వైసీపీ కార్యక్రమం ద్వారా.. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను తెలుసుకోగలిగామని వివరించారు సీతారాం. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశామని, కార్యక్రమాని జనం నీరాజనం పడుతున్నారన్నారు. కార్యక్రమం కోసం వైసీపీ శ్రేణులంతా నిక్కచ్చిగా పనిచేస్తున్నాయని, 'ప్రజలంతా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా' ఉన్నారని వివరించారు.
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయిందని, మహిళలయితే ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారని సీతారాం చెప్పుకొచ్చారు. నెల రోజుల తర్వాత మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, పార్టీ బలోపేతానికి నేతలంతా తమ సమీక్షా నివేదికలను జగన్ కు అందజేశారని ఆయన చెప్పారు. జగన్ సలహాలతో తిరిగి మరో నెల రోజులు విధుల్లో తమ బాధ్యతను నెరవేర్చడానికి సిద్దమైనట్లు ఈ సందర్బంగా ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications