జగన్ టూర్ లో మారిన పోలీసు వ్యూహం ? ప్రభుత్వం అక్కడ సక్సెస్ ?
ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తోతాపురి రైతుల్ని పరామర్శించేందుకు నిర్వహించిన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం యాత్రలో పోలీసులు వ్యూహం మార్చారు. గతంలో జగన్ టూర్లలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈసారి కొత్త వ్యూహంతో ముందుకెళ్లారు. అయితే అనుకున్న ఫలితం రాబట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. దీంతో ప్రభుత్వాన్ని మెప్పించడంలో మాత్రమే పోలీసులు సక్సెస్ అయ్యారన్న వాదన వినిపిస్తోంది.
జగన్ బంగారు పాళ్యం టూర్ సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఇందులో మార్కెట్ యార్డ్ లోకి 500 మందినే అనుమతిస్తామని, జగన్ కాన్వాయ్ తో పాటు 3 వాహనాలు మాత్రమే రావాలని ఆంక్షలు పెట్టారు. అయితే ఇవేవీ పట్టించుకోకుండా వైసీపీ చివరి నిమిషంలో భారీగా జనసమీరణ చేసింది. అంతే కాదు జగన్ ను చూసేందుకు జనం భారీగా పరుగులు తీశారు. దీంతో వారిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీ ఝళిపించారు. ఇందులో పలువురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని పరామర్శించేందుకు జగన్ కాన్వాయ్ ఆపాల్సి వచ్చింది. అయితే జగన్ కిందకు దిగకుండా పోలీసులు ఆపగలిగారు.

భారీగా తరలివచ్చిన జనంతో జగన్ టూర్ కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మార్కెట్ యార్డులోకి 500 మందినే అనుమతిస్తామని పోలీసులు చెప్పినా, తేడా వస్తే రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని ఎస్పీ మణికంఠ హెచ్చరికలు చేసినా జనం మాత్రం భారీగా తరలివచ్చి లోపలికి దూసుకెళ్లిపోయారు. దీంతో వీరిని కట్టడి చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. చివరికి జనం తాకిడి జగన్ తో పాటు వైసీపీలో మహిళా నేత రోజాతో పాటు ఇతర నేతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. వీరిని భద్రత కల్పించడం పోలీసులకు సాద్యం కాకపోవడంతో వారు చేతులెత్తేశారు.

అయితే ఓ విషయంలో మాత్రం పోలీసులు సక్సెస్ అయ్యారు. గత జగన్ టూర్లలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో బంగారు పాళ్యంలో డ్రోన్ కెమెరాలతో పాటు సాధారణ కెమెరాలు, సెల్ ఫోన్లలో దాదాపు టూర్ అంతా చిత్రీకరించారు. దీంతో వైసీపీ నేతల మాట విని రోడ్లపై వ్యూహాత్మకంగా ట్రాక్టర్లలో మామిడి పండ్లు తెచ్చి రైతులు పారబోయడం, డీఎస్పీని వైసీపీ కార్యకర్తలు తిట్టడం వంటి దృశ్యాల్ని పక్కాగా చిత్రీకరించగలిగారు. ఈ ఆధారాలన్నీ అంతిమంగా ప్రభుత్వానికి జగన్ పై రాజకీయంగా దాడి చేసేందుకు పనికొచ్చాయి. దీన్ని మించి శాంతిభద్రతల్ని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు.












Click it and Unblock the Notifications