చంద్రబాబును అరెస్టు చేయాలి, సారీ చెప్పాలి-పోలీసు అధికారుల సంఘం డిమాండ్..
ఏపీలోని చిత్తూరు జిల్లా పుంగనూరులో నిన్న వైసీపీ వర్సెస్ టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు, పోలీసులపై దాడి వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం దీనిపై స్పందించింది. ముఖ్యంగా చంద్రబాబు తీరును పోలీసు అధికారుల సంఘం తప్పుబట్టింది. పుంగనూరు ఘటనను తీవ్రంగా ఖండించిన పోలీసు అధికారుల సంఘం.. మీ రాజకీయాల కోసం మా పై దాడులు చేయిస్తారా అంటూ ప్రశ్నించింది.
పోలీసులను హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, పోలీసులను హతమార్చేందుకు కాకుంటే తుపాకులు, రాడ్లు, కర్రలతో టీడీపీ నాయకులు ఎందుకు వచ్చారని ప్రశ్నించింది. ఈ ఘటనతో ఒక పథకం ప్రకారమే పోలీసులను హతమార్చే భారీ కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయని సంఘం తెలిపింది. దీనిమీద ఎంక్వైరీ జరిపించాలని కోరింది.పోలీసులపై దాడి జరిగినా ప్రజాసంఘాలు, మానవహక్కుల సంఘాలు, ప్రజలు ఎవ్వరూ సానుభూతి చూపలేదని పేర్కొంది.

మేము సమాజంలో భాగం కాదా అని పోలీసు అధికారుల సంఘం ప్రశ్నించింది. పుంగనూరులో పోలీసులపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డీజీపీ, ప్రభుత్వాన్ని కోరింది. పోలీసులపై కొంతమంది ఉద్ధేశపూర్వకంగానే దాడి చేశారని,శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులపైనే దాడులు చేశారని సంఘం అధికారులు ఆరోపించారు. 50 మంది పోలీసులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. 13 మంది ఆసుపత్రిలో ఉన్నారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు.
14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడారని పోలీసుల సంఘం ఆరోపించింది. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపింది. డీఎస్పీ స్థాయి అధికారిని బట్టలిప్పాలనడం దుర్మార్గమంది. మీ ప్రభుత్వంలో కూడా పోలీసు వ్యవస్థలో మేం పనిచేశామని గుర్తుచేసింది. మేం ఏ పార్టీకి అనుకూలంగా ఎన్నడూ పనిచేయలేదని, మేం సహనం కోల్పోతే పరిస్థితి ఏంటని అడిగింది. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదంది. కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరికాదని సంఘం తెలిపింది. చంద్రబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని అధికారులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications