andhra pradesh amaravati ap police covid 19 guidelines orders ap govt ap news dgp sp ఆంధ్రప్రదేశ్ అమరావతి మార్గదర్శకాలు ఆదేశాలు ఏపీ ప్రభుత్వం డీజీపీ ఎస్పీ
ఏపీలో కరోనా కల్లోలం-నిబంధనలు ఉల్లంఘిస్తే ఉక్కుపాదం-ఒక్కరోజులో 17 లక్షల ఫైన్
ఏపీలో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండంతో అన్ని జిల్లాల్లో కేసులు పెరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా కరోనా నిబంధనల దుమ్ముదులుపుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై భారీగా జరిమానాలు విధిస్తోంది. నిన్న ఒక్క రోజే కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి రూ.17 లక్షలు ముక్కుపిండి వసూలు చేసింది. దీంతో పోలీసుల్ని చూస్తే జనం బెంబేలెత్తుతున్నారు.

ఏపీలో మళ్లీ కరోనా కల్లోలం
ఏపీలో మరోసారి కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. నెల రోజుల క్రితం వరకూ రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడొందల కేసులకు పరిమితైన పరిస్ధితి నుంచి ఇప్పుడు రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు వస్తున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రజలు, వాహనదారులు విఫలమవుతున్నారు. ఉద్దేశపూర్వక ఉల్లంఘనలు పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పోలీసుల సాయంతో మరోసారి రూల్స్ కఠినంగా అమలు చేయించే దిశగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఎస్పీలకు డీజీపీ సవాంగ్ హెచ్చరికలు
కరోనా విస్తరణ నేపథ్యంలో డీజీపీ గౌతం సవాంగ్ నిన్న విజయవాడ, విశాఖపట్నం పోలీసు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇతర జిల్లాల ఎస్పీలతోనూ మాట్లాడారు. ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా మాస్కుల్లేకుండా రోడ్లపై తిరిగే వారిని అస్సలు ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ సవాంగ్ ఆదేశాలు ఇచ్చారు కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. మాస్క్‌లు లేకుండా బయటికి వచ్చే వారికి భారీగా జరిమానాలు విధించాలని, వైరస్ వ్యాప్తికి కారకులయ్యే వారిని వదిలిపెట్టొద్దన్నారు.

కనీసం రూ.250 జరిమానా
డీజీపీ సవాంగ్ ఆదేశాల నేపథ్యంలో జిల్లాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలు జిల్లాల్లో పోలీసులు రోడ్లపైకి మాస్కుల్లేకుడా వస్తున్న వారిని గుర్తించి ఫైన్లు వేయడం మొదలుపెట్టారు. మాస్కుల్లేకుండా తిరుగుతున్న వారికి కనీసం రూ.250 చొప్పున జరిమానా విధిస్తున్నారు. రోడ్లపై ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేసి కరోనా నిబంధనలు పాటించేలా చూస్తున్నారు. నిన్న ఆదివారం అయినా పలు జిల్లాల్లో పోలీసులు కరోనా నిబంధనల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిని గుర్తించి జరిమానాల విధింపుతో పాటు కేసులు కూడా నమోదు చేశారు.

వేల మందికి లక్షల్లో జరిమానా
కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు గట్టి చర్యలు చేపడుతున్నారు. మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న 18,565 మందికి ఒక్క రోజులో రూ.17.34 లక్షల ఫైన్ విధించారు. మాస్క్ లేని వారికి రూ.250కి తగ్గకుండా జరిమానా విధించారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 2,327 మందికి ఫైన్ విధించగా తర్వాతి స్థానంలో ప్రకాశం 2,294, విజయవాడ సిటీ 2,106 చలానాలు రాశారు. అతి తక్కువగా విజయనగరంలో కేవలం 78 మందికి ఫైన్ విధించారు. పోలీసులు చేపడుతున్న చర్యలన్నీ ప్రజల కోసమేనని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అతి కొద్ది మంది జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి పెరుగుతోందన్నారు. ఫంక్షన్లు వాయిదా వేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా విద్యా సంస్థల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.