బీజేపీతో పొత్తు అంటే తెలుగుదేశం చిత్తే...పొత్తును వ్యతిరేకిస్తోన్న తెలుగు తమ్ముళ్లు..!
కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత దేశ రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటివరకు చంద్రబాబునాయుడుకు ఫోన్‌లో కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వని బీజేపీ అధిష్టానం ఏకంగా ఆయనతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం కావడం బీజేపీకి అనుకూలమేమోకానీ, ఏపీలో తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆత్మహత్యా సదృశ్యమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అంటే దృతరాష్ట్ర కౌగిలే అని విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి చంద్రబాబు తెలుగు తమ్ముళ్ల మనోభావాలను గౌరవిస్తారా?
బాబు కేరాఫ్ యూటర్న్!
రాజకీయాల్లో యూ టర్న్‌లు కొత్తకాదు కానీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తరహా యూటర్న్‌లు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తే. 2014లో బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు, తీరా ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మోడీని తీవ్రంగా వ్యతిరేకించారు. బీజేపీ విధానాలపై జాతీయ స్థాయిలో విరుచుకపడ్డారు. మోడీ ఖబడ్దార్ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మోదీ అండదండలపై శోకాలు పెట్టారు.

అపవిత్ర పొత్తు, లోపాయికారి పొత్తు, రాష్ట్రం పాలిట శాపం బీజేపీ- వైసీపీలంటూ ఈ నాలుగేళ్లు ప్రజల సమక్షంలో ఏకరువు పెట్టారు. అలాంటి చంద్రబాబునాయుడుకు ఏమైంది? ఆయన జాతీయ రాజకీయాలను ఒంటిచేత్తో మలుపు తిప్పే సమర్థత ఎక్కడపోయింది? బీజేపీకి ప్రత్యామ్నాయంగా విపక్షాలను ఏకం చేయగల సత్తా ఉందంటూ సొంత మీడియాలో ఊదరగొట్టించుకున్న బాబు, తెలంగాణ ఎన్నికల్లో ఏకంగా టీడీపీ ఆగర్భ శత్రువు కాంగ్రెస్‌పార్టీతో పొత్తు పెట్టుకున్న బాబు ఎందుకు మోదీ, షాల భజనకు మళ్లారు. ఏమైంది? ఎందుకు మోదీ, అమిత్‌షాల ఫోన్ కోసం, అపాయింట్‌మెంట్ కోసం వెంపర్లాడుతున్నారు? ప్రత్యేకహోదా విషయంలో తప్ప. ఇక అన్ని విషయాల్లోనూ మోదీ విధానాలను సమర్థిస్తామని ఎందుకు బహిరంగంగా చెబుతున్నారు?
జగన్-మోదీ భాయి భాయి!
గత ఎన్నికల్లో జగన్ పార్టీ దెబ్బకు చావు తప్పి, కన్నులొట్టపోయిన చంద్రబాబునాయుడు, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టదలచుకోలేదు. జనసేనను, వామపక్షాలను ఇప్పటికే తెలివిగా తన దారిలోకి తెచ్చుకున్న చంద్రబాబునాయుడు, కేంద్రంలోని బీజేపీ అండదండలు ఉంటే తప్ప ఏపీలో వైసీపీని ఎదుర్కోలేనని పసిగట్టారు. జగన్-మోదీ ప్రభుత్వాల మధ్య ఉన్న సయోధ్యను, సఖ్యతను దెబ్బతీసేందుకు మొదటి నుంచి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఆ పప్పులేమీ ఉడకలేదు.
జగన్ పట్ల మోదీకి, మోదీ పట్ల జగన్‌కు స్పష్టమైన అవగాహనతో ఉంటూ వస్తున్నారు. ఇటీవలే ఏపీకి కేంద్రం 10వేల కోట్లకు పైగా ఏకమొత్తంలో నిధులు విడుదల చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుకేకాదు, అనేక రోడ్డు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులకు ఆమోదం తెలిపింది. ఇవన్నీ చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకులేకుండా చేశాయంటున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు ఇంత పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తే ఇక ప్రజలు తనకు ఓట్లు వేస్తారా అన్న భయం బాబును పీడిస్తోంది.

ఎలాగైన మోడీ, అమిత్‌షాల ప్రాపకం సంపాదించాలనే వ్యూహాలకు చంద్రబాబు పదును పెట్టారు. తన మంది, మార్బలంతో, అనుకూల వ్యాపార వర్గాలతో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు రాయబారం పంపారు. ఆ మధ్య ఒక జాతీయ ఛానెల్‌లో జరిగిన చర్చలో మోదీని, ఆయన ఆర్థిక విధానాలను పొగడ్తలతో ముంచేశారు. బీజేపీతో గ్యాప్ ఫిల్ చేసుకోవడానికి అవకాశం కల్పించారంటూ ఇంగ్లిష్ చానల్‌కు తరువాత ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు కూడా చెప్పారు.
ఇదంతా కేవలం తాను ఏపీలో అధికార పీఠం దక్కించుకునే వ్యూహంలో భాగమే కానీ, ఇక్కడే తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబుపై మండిపోతోంది. ఏపీ విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల 2018లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీతో పొత్తుపెట్టుకుని ఏపీలో పోటీ చేసినా తెలుగుదేశం పార్టీకి అవే ఫలితాలు వస్తాయన్నది తెలుగు తమ్ముళ్ల అంచనా. మరి వారి ఆవేదన చంద్రబాబు చెవికి చేరుతుందా?
అధికారంలో ఉండగా మోడీపై ధిక్కారం!
అధికారంలో ఉండగా ప్రత్యేకహోదా, రాష్ట్ర ప్రయోజనాలు, ధర్మాగ్రహ దీక్షల పేరుతో బీజేపీపై తీవ్రంగా పోరాడారు చంద్రబాబునాయుడు. ఊరూర తెలుగు తమ్ముళ్లను బిజేపి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములను చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం పైసా విదిల్చలేదని, రాజధాని శంకుస్థాపనకు వచ్చినప్పుడు సైతం మోడీ మట్టి, నీరు ఇచ్చి వెళ్లారని తిట్టిపోశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ అబద్ధాలు చెప్పారని జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వినిపించారు.

నోట్ల రద్దుతో సామాన్య జనంలో మోడీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, మైనార్టీలు మోదీకి ఓట్లేయరని, టీడీపీ కూడా బీజేపీతో ఉంటే మొదటికే మోసమని చంద్రబాబు కిచెన్ క్యాబినెట్‌లోని ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు ఇచ్చిన తప్పుడు సలహా విని ఎన్నికలకు ఏడాది ముందే యుద్ధం ప్రకటించారు. ఇలా వ్యతిరేకిస్తే ఏపీలోని ముస్లిం మైనార్టీలు, క్రైస్తవులు టీడీపీకి అండగా ఓట్లేస్తారనుకుంటే, ఆ వర్గాలేమో జగన్ పార్టీకి జై కొట్టారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీజేపీతో పెట్టుకోవద్దనే అవగాహనకు చంద్రబాబునాయుడు వచ్చారు. కానీ బీజేపీతో స్నేహ హస్తం కోసం లోలోపల పట్టువిడవని విక్రమార్కుడిలా శ్రమిస్తూనే ఉన్నారు.
బీజేపీకి పోయేది లేదు....!
కర్ణాటక ఫలితాల తరువాత బీజేపీ అగ్రనేతలైన మోదీ, షాల వైఖరిలో మార్పు వస్తున్నట్లు తెలుస్తోంది. పాత మిత్రులతో స్నేహహస్తం కోసం వారు సిద్ధమైనట్లు చంద్రబాబుతో భేటీతో స్పష్టమైంది. 2018 వరకు ఎన్‌డీఏలో అంటకాగిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి ఒప్పుకున్న బాబు, మళ్లీ అదే హోదా ఇవ్వలేదని కూటమి నుంచి బయటకు వచ్చేశారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే కేంద్రం సహకారం అవసరం. అందుకే చంద్రబాబు బీజేపీతో స్నేహం కోరుకుంటున్నారు.

కానీ బీజేపీ మాత్రం అటు వైసీపీ, ఇటు టీడీపీతో స్నేహంగా ఉంటే ఎవరు గెలిచినా కేంద్రంలో మనకే మద్దతు ఇస్తారన్న ఆశతో ఉంది. ఏపీలోని రెండు పార్టీలు తన గుప్పెట్లో ఉంటాయని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. కర్ణాటకలో పరాజయం తరువాత ఎలాగైనా తెలంగాణలో అధికారం సంపాదించాలనే లక్ష్యం బీజేపీకి ఉంది. దానికి తెలంగాణలో ఇప్పటికీ మిగిలి ఉన్న తెలుగుదేశం క్యాడర్ మద్దతు అవసరమవుతోంది. తెలంగాణలో బీజేపీ-టీడీపీ పొత్తు ఖాయమని అంటున్నా, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు.
ఏపీలో కలిసొచ్చిన బీజేపీ-టీడీపీ పొత్తు!
ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబునాయుడుకు లేదు. ఆయన ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. అలా జనసేన, బీజేపీతో పెట్టుకోవడం వల్లే 2014లో అధికారంలోకి వచ్చారు. టీడీపీతో పొత్తు బీజేపీకి చాలా సార్లు కలసి వచ్చింది. టీడీపీతో జత కట్టడం వల్ల గతంలో బీజేపీకి కేంద్రంలో అధికారం కూడా దక్కింది. ఒక్క జనసేన కలిస్తే గెలిచిపోతామనే విశ్వాసంతో ఉన్న టీడీపీకి ఎక్కడా ఇంకా జగన్ పాలనపై డౌట్ కొడుతోంది. అందుకే అది కేంద్రంలో బలమైన బిజేపి ఆశీస్సులు కోరుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే ఉన్నా, దక్షిణాదిలో మాత్రం ఆపార్టీకి చిక్కులు వచ్చిపడుతున్నాయి.

కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీని కాంగ్రెస్ ఓడించింది. అంతకు ముందు పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, బిహార్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలు బీజేపీని షాక్‌కు గురిచేశాయి. ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నాయి. ఈ విషయమే బీజేపీని కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ కూటమి బలోపేతమవుతుందనే సంకేతాలకు విరుగుడులో భాగమే చంద్రబాబుతో మోడీ, నడ్డా భేటీ అంటున్నారు కమలనాథులు. కానీ కమలంతో స్నేహం ఏపీలో టీడీపీకి చేటు తప్ప, ఓటు తెచ్చి పెట్టదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.












Click it and Unblock the Notifications