జగన్ ను దెబ్బ తీయాలంటే : పవన్ తో పొత్తు- చంద్రబాబు భారీ వ్యూహం : 9న నిర్ణయం దిశగా ..!!
ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెర పైకి వస్తున్నాయి. వచ్చే ఎన్నికలు ఆషామాషీ కాదని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు మరో కీలక అడుగు వేస్తున్నారు. తిరిగి పాత మిత్రులతో కలయిక కోసం చంద్రబాబు సిద్దంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చారు. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబుకు అనూహ్య పరిణామం ఎదురైంది. ఇప్పటి వరకు టీడీపీ మాజీ మంత్రులు చేస్తున్న డిమాండ్ ఇప్పుడు కార్యకర్తల నుంచి మొదలైంది. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటూ కోరారు.

కార్యకర్తల నోట చంద్రబాబు మనసులో మాట
ఇదే విషయాన్ని నేరుగా చంద్రబాబు తో చెప్పేసారు. దీనికి చంద్రబాబు సైతం అదే స్థాయిలో స్పందించారు. 'లవ్ వన్ సైడ్ కాదు.. రెండు వైపులు ఉండాలి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏకపక్ష లవ్ తో ఎలా అని సమాధానం ఇచ్చారు. దీని ద్వారా టీడీపీ నేతలు.. కార్యకర్తలతో పాటుగా చంద్రబాబు సైతం పవన్ కళ్యాణ్ తో పొత్తుకు సిద్దంగా ఉన్నారనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో టీడీపీ - జనసేన నేతలు అనధికార పొత్తుతో కొన్ని స్థానాలను గెలుచుకున్నారు. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ లాంటి వరు ఓపెన్ గానే జనసేనతో టీడీపీ మరలా పొత్తు పెట్టుకోవాలని డిమాండ్ చేసారు. ఇక, జనసేన కేడర్ లోనూ తిరుపతి ఎన్నికల సమయం నుంచీ బీజేపీ తో కొనసాగటానికి సుముఖంగా లేరనే విషయం స్పష్టమవుతూనే ఉంది.

పవన్ కు చంద్రబాబు ప్రేమ సందేశం
తాజాగా పవన్ కళ్యాన్ బీజేపీ పైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయకపోయినా .. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు- దీక్ష, అదే సమయంలో వైసీపీ కావాల్సిన సమయంలో కేంద్రానికి మద్దతిస్తూనే ఉంది కదా అంటూ చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా కేంద్రాన్ని నిలదీయాలంటూ వైసీపీ ఎంపీలకు డిమాండ్ పెట్టటం వంటివి చూస్తుంటే త్వరోలనే పవన్ సైతం బీజేపీతో దూరం అవుతారనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక, కొద్ది రోజుల క్రితం పవన్ రాజమండ్రి సభలో కొత్త సామాజిక సమీకరణాలను తెర మీదకు తెచ్చారు. దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో అధికారం ఖాయమని చెబుతున్న పవన్...బీజేపీతో కలిసి అనే మాట చెప్పటం లేదు. బీజేపీ నేతలు మాత్రం 2024 లో బీజేపీ - జనసేన ప్రభుత్వం ఖాయమంటూ చెప్పుకొస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సైతం సై అంటారా..
ఇప్పుడు స్వయంగా చంద్రబాబు తమ నుంచి పవన్ పైన లవ్ ఉన్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అటు నుంచి లవ్ ఉంటే కలవటం సాధ్యపడుతుందనే అభిప్రాయం పరోక్షంగా తేల్చి చెప్పారు. దీని ద్వారా ఇప్పుడు జనసేనలోనూ ఆసక్తి కర చర్చ మొదలైంది. అందులో భాగంగా... ఈ నెల 9వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. అందులో దీని పైన చర్చించిన తరువాత పవన్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. అయితే, బీజేపీతో ఉంటూ టీడీపీతో పొత్తు సాధ్యం కాదు. బీజేపీతో కట్ అవుతేనే..చంద్రబాబుతో ఐక్యత సాధ్యమవుతోంది.

9న సమావేశంలో తేల్చేస్తారంటూ
అదే సమయంలో టీడీపీ మాత్రం 2014 పొత్తులే రిపీట్ కావాలని కోరుకుంటోంది. పవన్ ద్వారా ఆలస్యమైనా..బీజేపీతో కలిసే మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తేనే.. జగన్ ను దెబ్బ తీయగలుగుతామనే అంచనా టీడీపీ నుంచి కనిపిస్తోంది. ప్రస్తుతం కాపు నేతల ఐక్యత.. సమావేశాలు.. అధికారంలో ప్రాధాన్యత లాంటి అంశాల నడుమ.. పవన్ కళ్యాణ్ తో పొత్తు అన్ని రకాలుగా అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతోనే పవన్ కు లవ్ ప్రొపోజల్ చేసారు. దీంతో..ఈ పొత్తు లాంఛనమే అని చెబుతున్నారు. దీంతో..ఈ నెల 9న జరిగే సమావేశం కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications