పవన్ పై పోటీకి వైసీపీ అభ్యర్ధి సిద్దం - సీఎం జగన్ మార్క్ రాజకీయం..!?
వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకొనేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో పాటుగా పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే మెజార్టీ ఓట్ బ్యాంక్ ను ఓన్ చేసుకొనేందుకు ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు. ఇక, టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా మారుతున్న వేళ గోదావరి జిల్లాల కేంద్రంగా కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సారి పవన్ కల్యాణ్ పైన పోటీతో సహా ఎదుర్కోవటానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పవన్ పై పోటీకి కొత్త అభ్యర్ధి:వై నాట్ 175. ఇదీ ముఖ్యమంత్రి జగన్ నినాదం. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల ఎంపిక పైన ఫోకస్ చేసారు. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్దులు..సామాజిక సమీకరణాలు..స్థానిక అంశాలు..సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్దులను ఫైనల్ చేస్తున్నారు. ఇదే సమయంలో అవసరమైన నియోజకవర్గాల్లో కొత్త నేతలను పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా ఈ సారి టీడీపీ - జనసేన పొత్తుతో గోదావరి జిల్లాల్లో ప్రభావం ఉంటుందనే అంచనాల నడుమ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పైన పోటీకి అభ్యర్దిని సిద్దం చేస్తున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ తాను త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

వైసీపీలోకి ముద్రగడ:ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దమైందని సమాచారం. కుమారుడితో సహా పార్టీలో చేరుతారని ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది. ముదగ్రడ లేదా ఆయన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పిఠాపురం అభ్యర్దిగా బరిలో దించుతారని చెబుతున్నారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయటం ఖాయమని సమాచారం. గతం ఎన్నికల్లో పశ్చిమ నుంచి నుంచి పోటీ చేసిన పవన్ ఈ సారి తూర్పు నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. ముద్రగడకు ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో పట్టు ఉంది. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉంది. చంద్రబాబు తో విభేదించిన ముద్రగడను జనసేనాని పైన అభ్యర్ధిని దింపుతారని తెలుస్తోంది. 2009లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ముద్రగడ ఓడిపోయారు. ప్రత్తిపాడులో గెలిచిన రికార్డు ఉన్నా, 2004లో ఓటమి తరువాత ఇక ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ముద్రగడ ప్రకటించారు.
పిఠాపురంలో పవన్ పై పోటీ:ఇప్పుడు పిఠాపురంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. 2009లో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత ప్రస్తుతం కాకినాడ నుంచి వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ నుంచి పవన్ పోటీకి దిగితే పద్మానాభం లేదా ఆయన కుమారుడు గిరిబాబు కు ఛాన్స్ ఇస్తే అన్న రకాలుగా లెక్కలు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లో పవన్ పైన రెండు చోట్ల వైసీపీ అభ్యర్దులే గెలుపొందారు. స్థానికంగా రాజకీయంగా పట్టు ఉన్న నేతలు వైసీపీలో ఉండటంతో ఈ సీటును ముద్రగడ కుటుంబానికి కేటాయిస్తే పవన్ పైన పై చేయి సాధించవచ్చని లెక్కలు వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ముద్రగడ ఎంట్రీ ద్వారా పవన్ కల్యాణ్ ను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహానికి వైసీపీ పదును పెడుతోంది. రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాల్లో సమీకరణాల పైన ముద్రగడ పద్మనాభం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. రెండు మూడు రోజుల్లోనే ఈ మొత్త వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications