బీజేపీ తేల్చేసింది, ఏపీలో పొత్తుల లెక్క పక్కా - గెలిచేదెవరు..!?
ఏపీలో పొత్తుల రాజకీయం లెక్క పై క్లారిటీ వస్తోంది. ఎవరు ఎవరితో కలుస్తారనేది దాదాపు స్పష్టత వచ్చేసింది. టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలనే జనసేనాని పవన్ ఆశలు నెరవేరే అవకాశం కనిపించటం లేదు. బీజేపీ తమకు జనసేనతో మాత్రమే పొత్తు అని తేల్చి చెబుతోంది. టీడీపీలో పొత్తుకు భిన్నంగా ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో, ఏపీలో రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే మరి గెలిచెదెవరు.
పొత్తుకు బీజేపీ విముఖత: ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రచారం మరో సారి తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా టీడీపీ మహానాడు వేదికగా పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ముఖ్యమంత్రి జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే నేరుగా గడప గడపకు పార్టీ నేతలను పంపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా తాను బాధ్యత తీసుకుంటానని చెబుతూ వచ్చిన పవన్ కల్యాణ్ కొత్త పొత్తుల ప్రతిపాదన చేసారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పొత్తుతో 2014 తరహాలో ముందుకు వెళ్లే విధంగా ప్రతిపాద చేసారు. బీజేపీని ఒప్పిస్తామంటూ పవన్ చెప్పుకొచ్చారు. కానీ, ఢిల్లీ కేంద్రంగా సమీకరణాలు మారిపోతున్నాయి.

టీడీపీ జనసేన తో వామపక్షాలు: బీజేపీతో పొత్తు వ్యవహారంలో టీడీపీ ఎక్కడా నేరుగా జోక్యం చేసుకోలేదు. పవన్ ఆ బాధ్యత తీసుకున్నారు. బీజేపీ ముఖ్య నేతల ముందు ప్రతిపాదన చేసారు. ఇంతలో సీఎం జగన్ ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పారు. సమయం చూసి అడుగులు వేసారు. పొత్తు ప్రతిపాదన జనసేన నుంచి వెళ్లిన తరువాత కేంద్రం నుంచి ఏపీలో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పార్లమెంట్ ప్రారంభోత్సవ సమయంలోనూ తాము జగన్ కు ఇస్తున్న ప్రాధాన్యతను మరోసారి స్పష్టం చేసింది. ఈ సమయంలో బీజేపీ ఏపీ సహ ఇంఛార్జ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ తో టీడీపీ బంధం ఇంకా తెగిపోలేదంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీడీపీ నేత నారా లోకేష్ బీజేపీతో తాము పొత్తు కోసం కలిశామా అని ప్రశ్నించారు. దీని ద్వారా ఇక రెండు పార్టీలు కలిసేది లేదనేది స్పష్టం అవుతోంది.

ఏపీలో త్రిముఖ పోరు: దీంతో ఏపీలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీతో కలిసేందుకు బీజేపీ సిద్దంగా లేకపోవటంతో, పవన్ మాత్రం కలిసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆ నిర్ణయం పవన్ నుంచే వచ్చేలా బీజేపీ వ్యవహరిస్తోంది. అదే జరిగితే టీడీపీ, జనసేనతో వామపక్షాలు జత కట్టి నాలుగు పార్టీలు ఒక కూటమిగా పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. బీజేపీ, వైసీపీ వేర్వేరుగా పోటీ చేయటం అనివార్యంగా మారుతోంది. బీజేపీ తో పొత్తు కారణంగా ఓట్లు వస్తాయనే ఆశ లేకపోయినా..ఎలక్షన్ మేనేజ్ మెంట్ వ్యవహారంలోనే టీడీపీ సంశయిస్తోంది. సీఎం జగన్ పూర్తిగా సంక్షేమం పైనే భారం వేసారు. నవ్ ఆర్ నెవర్ అనే విధంగా టీడీపీ ముందుకెళ్తోంది. ఈ సమయంలో ముందస్తు ఎన్నికలు వస్తే రాజకీయ వాతావరణం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ సమీకరణాల నడుమ ఏపీలో గెలిచేదెవరు.












Click it and Unblock the Notifications