ఏపీలో వర్ష బీభత్సం ఇలా.. ప్రజలకు మంత్రి నారా లోకేష్ అలెర్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ కొండూరు మండలం కృష్ణారావు పాలెం కేశ్యా తండా మధ్య వాగులో వరద ఉధృతి పెరగడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు..
ప్రకాశం బ్యారేజీ లోని మొత్తం 70గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా నదికి వరద పోటెత్తడంతో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెం లో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల, వినగడప మధ్య ఉన్న కట్టలేరువాగుకు వరద ఉధృతి కొనసాగుతుంది.

20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
దీంతో సమీపంలోని 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. విజయవాడలోనూ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగరంలోని ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మచిలీపట్నంలోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది.
ప్రజలను అలెర్ట్ చేసిన మంత్రి నారా లోకేష్
ఇక ఏపీవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతోటి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు రాష్ట్ర ప్రజలకు మంత్రి నారా లోకేష్ సూచనలు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వంతోపాటు విపత్తు నిర్వహణ శాఖ ఇస్తున్న అలర్ట్ మెసేజ్ లను గమనిస్తూ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన
వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు బయటకు రాకుండా ఉండటమే మంచిదని పేర్కొన్నారు. కొండ చరియలు విరిగిపడి ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికార యంత్రాంగం సూచించిన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు, కార్యకర్తలు సహాయ చర్యలు చేపట్టాలని పూర్తి సహకారం అందించాలని లోకేష్ పిలుపునిచ్చారు. విపత్తుల కష్ట సమయాలలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని నారా లోకేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications